
మదనపల్లె కేంద్రంగా అసాంఘిక వ్యవహారాలు
సాక్షి రాయచోటి: జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ నిషాంత్‌కుమార్, ఎస్పీ ధీరజ్‌లకు సమస్యలు సవాలుగా మారనున్నాయి. అన్నమయ్య జిల్లా 2022 ఏప్రిల్ 4న ఆవిర్భవించింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ఆరు నియోజకవర్గాలతో జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పీఎస్ గిరీషా, అభిషిక్త్ కిశోర్, చామకూరి శ్రీధర్‌లు పనిచేయగా, నూతనంగా నాలుగో కలెక్టర్‌గా నిషాంత్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాపోలీసు సూపరింటెండెంట్‌లుగా మొదటగా హర్షవర్దన్‌రాజు, గంగాధర్‌రావు, కృష్ణారావు, విద్యాసాగర్‌నాయుడులు పనిచేయగా జిల్లా ఐదో ఎస్పీగా ధీరజ్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించగానే విజయవాడలో సీఎంతో కలెక్టర్లు, ఎస్పీల సమీక్షల నేపథ్యంలో అక్కడికి వెళ్లారు. అయితే జిల్లాలో వేళ్లూనుకున్న సమస్యలు, ఇతర శాంతిభద్రతల పరంగా అనేక రకాల సమస్యలు కలెక్టర్, ఎస్పీలకు సవాలుగా మారుతున్నాయి.
జిల్లా కేంద్రంలో సాగని అభివృద్ధి
అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పడిన అనంతరం వైఎస్ జగన్ సర్కార్ హయాంలో అభివృద్ధి పరంగా పరుగులు తీసింది. ఎక్కడికక్కడ జాతీయ రహదారుల్లో మహానీయుల విగ్రహాలు, డివైడర్లు, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కుల ఏర్పాటు ఇలా ప్రతి ఒక్క పని పరుగులు పెట్టింది. డీఎస్పీ కార్యాలయం, ఆర్‌అండ్‌బీ అతిథిగృహం, సచివాలయాలు, ఆర్బీకేలు ఇలా చెబుతూ పోతే చాలావరకు పూర్తయ్యాయి. ఆస్పత్రి ఆధునికీకరణ పనులు కూడా పూర్తి చేశారు. కొత్తహంగులు అద్దుకునే దశలో పనులు పెండింగ్‌లో పడిపోయాయి. ప్రధానంగా క్రికెట్ స్టేడియం, శిల్పారామం, నగరవనం, ఎంఐజీ లేఅవుట్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అక్కడక్కడ రోడ్లు మినహా మిగతా పనులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కొత్త ప్రణాళికతో నూతన కలెక్టర్ పెండింగ్ పనులతోపాటు ఇతర అభివృద్ది పనులను పరుగులు పెట్టించాలని ప్రజలు కోరుతున్నారు.
● జిల్లాకు సంబంధించి ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అనేక వనరులు ఉన్నాయి. మదనపల్లె, సిద్దవటం మండల పరిధిలోని చేనేత రంగం బాగా పటిష్టంగా ఉంది. అక్కడ ప్రభుత్వ పరంగా టెక్స్‌టైల్స్ పరిశ్రమలు తేవడం ద్వారా పలువురికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. రైల్వేకోడూరు పరిధిలోని శెట్టిగుంట చెక్కబొమ్మల తయారీకి ప్రసిద్ధి. అలాగే రైల్వేకోడూరు, రాయచోటి, మదనపల్లె, రాజంపేట, పీలేరు ప్రాంతాల్లో మామిడి, అరటి, బొప్పాయి పంటల సాగు అధికంగా ఉంది. హార్టికల్చర్ పరంగా ఏదైనా అభివృద్ది చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. జ్యూస్, గుజ్జు పరిశ్రమలు తీసుకు రావడం ద్వారా అటు రైతులకు, ఇటు యువతకు ఉపాధి లభిస్తుంది. తంబళ్లపల్లె, మదనపల్లె ప్రాంతాల్లో గ్రానైట్‌తోపాటు మైనింగ్ పరిశ్రమలు ఉన్నాయి. మంగంపేటలో పేరెన్నికగన్న బైరెటీస్, ముగ్గురాయి పరిశ్రమలు ఉన్నాయి. ఏపీఎండీసీపై ఆధారపడి వందల సంఖ్యలో చిన్నచిన్న పరిశ్రమలు ఉన్న నేపద్యంలో పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తే పెద్ద ఎత్తున ప్రయోజనాలు ఒనగూరనున్నాయి.
ఆరితేరిన అక్రమార్కులు
జిల్లాలో శాంతిభద్రతల పరంగా ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేకపోయినా చాలాచోట్ల అక్రమార్కులు ఆరితేరిపోయారు. ఎక్కడికక్కడ అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తూ అధికారం మాటున సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం పేకాట, దౌర్జన్యాలు, దాడులు అధికంగా సాగుతున్నాయి. ప్రధానంగా ఇసుక అక్రమ రవాణా రాత్రిపూట యథేచ్ఛగా సాగుతోంది. ఎర్రచందనానికి ప్రసిద్ధిచెందిన శేషాచలం అడవుల నుంచి అక్రమార్కులు దుంగలను తరలిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులతో అప్పుడప్పుడు కొన్ని దుంగలు దొరకుతున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మరోవైపు ప్రతినిత్యం ఆవులు, పశువులను పెద్ద సంఖ్యలో లారీలలో తరలిస్తున్నారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రాయచోటి, మదనపల్లె మీదుగా బెంగుళూరుకు పెద్ద ఎత్తున పశువుల దందా సాగుతోంది. ఇందులో భాగంగా పలువురు పోలీసులతో మామూళ్లు మాట్లాడుకుని పశువుల రవాణాకు ఇబ్బందులు లేకుండా చేసుకుంటున్నట్లు పోలీసు వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అన్నమయ్య జిల్లా కలెక్టరేట్
జిల్లాలోనే ప్రధాన పట్టణంగా గుర్తింపు పొందిన మదనపల్లెలో అసాంఘిక కార్యకలాపాలు రాజ్యమేలుతున్నాయి. పీలేరు, మదనపల్లె, రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లో గంజాయి చాపకింద నీరులా విద్యార్థుల దరిచేరుతోంది. ఇందుకు ఉదాహరణగా గతంలో ఇద్దరు విద్యార్థులు గంజాయి మత్తులో రైలు కిందపడి మృతి చెందారు. మదనపల్లెలో కూడా గంజాయి వాసనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల అనేక హత్యలు కూడా చోటుచేసుకున్నాయి. క్షణికావేశంలో జరిగే హత్యలు కొన్ని అయితే, ఓ సీఐ తల్లికి మాటమాటలు చెప్పి నగలు దోచుకుని మట్టుబెట్టిన వైనం గతంలో సంచలనం సృష్టించింది. బాలలపై అఘాయిత్యాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయి. జిల్లా ఎస్పీగా బాద్యతలు చేపట్టిన ధీరజ్ మదనపల్లైపె కూడా ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.జిల్లాలోని గువ్వలచెరువు ఘాట్, రాయచోటి–చిత్తూరు జాతీయ రహదారితోపాటు కడప–రేణిగుంట ప్రధాన రహదారిలోని రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. మరోవైపు జిల్లాలో భూ కబ్జాలు, రౌడీయిజం పెరిగింది. రాయచోటి ఇటీవల వరుస ఘటనలు చోటుచేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై నూతన ఎస్పీ ఉక్కుపాదం మోపాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీలకు స్వాగతం పలుకుతున్న సమస్యలు
జిల్లాలో ఎక్కడ చూసినా పేకాట, విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
మదనపల్లె కేంద్రంగా హత్యలు
అధికార పార్టీ ఆగడాలు, పెరిగిపోయినభూ ఆక్రమణలు, కబ్జాలు
శేషాచలం అడవుల నుంచి తరలిపోతున్న ఎర్ర బంగారం

మదనపల్లె కేంద్రంగా అసాంఘిక వ్యవహారాలు

మదనపల్లె కేంద్రంగా అసాంఘిక వ్యవహారాలు

మదనపల్లె కేంద్రంగా అసాంఘిక వ్యవహారాలు