
ఆర్భాటం.. హంగామా?
మదనపల్లె సిటీ: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి తెర లేపింది. 150 రోజుల పాటు కసరత్తు జరిపి హంగామా చేశారు. తీరా అర్హులకు న్యాయం చేశారా అంటే అదీ లేదు. అనర్హులకు, అనుకూలమైనవారికి ఉద్యోగాలు కల్పించారని ప్రచారం జరుగుతోంది .ఇప్పుడు నియామకపత్రాల పంపిణీ పేరుతో మరో డ్రామాను తెరమీదకు తెచ్చారు. ఈనెల 19న విజయవాడ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు పంపిణీ చేస్తామంటూ హంగామా సృష్టిస్తోంది. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల నుంచి విజయవాడకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పలువురు మండిపడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచక అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది.
● ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల వ్యాప్తంగా నిర్వహించిన మెగా డీఎస్సీ కసరత్తు విమర్శలకు తావిస్తోంది.150 రోజుల పాటు సాగదీసి అర్హులకు మెండి చేయి చూపారని పలువురు మండిపడుతున్నారు. ఈనెల 15న మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను ప్రచురించారు. ఈ జాబితా ప్రచురించాక వందల సంఖ్యలో హెల్ప్‌డెస్క్‌కు కాల్ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు వెళ్లారు. న్యా యం చేయాలని వేడుకున్నారు. అభ్యర్థులకు విద్యాశాఖ అఽ దికారులు సమాధానం చెప్పలేని స్థితిలో మిగిలిపోయారు.
● గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం డీఎస్సీ (డిస్టిక్ సెలెక్షన్ కమిటీ) పేరుతో తిలోదకాలు వదిలింది. నిబంధనల ప్రకారం డీఎస్సీ కసరత్తు మొత్తం ఎన్నో ఏళ్లుగా జిల్లా స్థాయిలోనే జరిగేది. అయితే ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలోనే నిర్వహించారు. ఇందులో పలు అక్రమాలు జరిగాయని అభ్యర్థులు వాపోతున్నారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత మెరిట్, రోస్టర్ ప్రకారం విడుదల చేయాల్సిన జాబితా ఆఖర్లో గందరగోళం సృష్టించారు.ఎంపిక జాబితా పేరుతో ఐదు సార్లు ప్రచురించి, కాల్‌లెటర్లు పంపి, సర్టిఫికెట్లు పరిశీలించారు. తీరా తుది జాబితా ప్రచురించే సమయానికి ఎక్కువ ర్యాంకులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు, తక్కువ ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు అనర్హులుగా పేర్కొన్నారు. దీంతో వందలాది మంది నష్టపోయారు.
● మెగా డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు అందజేసే నియామకపత్రాలు పంపిణీ కసరత్తును కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచారంగా మలుచుకుంది. ఈ ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో విజయవాడలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా రావాలని విద్యాశాఖ అధికారులు సందేశాలు పంపారు. దాదాపు 500 కిలోమీటర్లు దూరం వెళ్లాలంటే ఎంతో వ్యయప్రయాసాలతో కూడుకున్న పని. డీఎస్సీకి ఎంపికై న వారిలో గర్భిణులు, చంటిపిల్లల తల్లులు కూడా ఉన్నారు. వీరు అంతదూరం వెళ్లాలంటే ఇబ్బందులు పడాలి. ప్రభుత్వ నిర్ణయంపై పలువురు మండిపడుతున్నారు.
డీఎస్సీ ఆర్డర్లకు 500 కిలోమీటర్లు వెళ్లాలా!
మండిపడుతున్న అభ్యర్థులు

ఆర్భాటం.. హంగామా?