
పంట నమోదు ప్రక్రియ తనిఖీ
రాయచోటి: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పంట నమోదు కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం రాయచోటి రూరల్ మండలం, ఎగువ అబ్బవరం గ్రామంలో జరుగుతున్న పంట నమోదు ప్రక్రియను జేసీ పరిశీలించారు. రాయచోటి అర్బన్ ఆర్‌ఎస్‌కె ఇన్‌చార్జిని పంట నమోదు ప్రక్రియ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రాయితీలకు పంట నమోదు ముఖ్యమన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని జేసీ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జి శివనారాయణ, మండల వ్యవసాయ అధికారి కె రాజేంద్ర ప్రసాద్, విఏఏ శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
కడప ఎడ్యుకేషన్: డాక్టర్ .వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలోని ఆర్కిటెక్చర్ విద్యార్థులకు సీఓఏ(కౌన్సిల్ ఆఫ్ అర్టికల్చర్) నుంచి కోర్సులకు అనుమతులు, ఎన్‌రోల్‌మెంట్ నంబర్లు మంజూరయ్యాయని వైస్ చాన్సలర్ విశ్వనాథకుమార్ తెలిపారు. ఇందులో ఆర్కెటెక్చర్ విభాగానికి సంబంధించి 2020–21, 2021–22, 2022–23 బ్యాచ్‌ల విద్యార్థులకు సీఏఓ నుంచి కోర్సు అనుమతులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: వైఎస్‌ఆర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9.00 గంటలకు జమ్మలమడుగులోని సాయి పరమేశ్వర డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 12 కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ చదివి ఉండాలన్నారు. 18–40 సంవత్సరాల మధ్య వయస్సుగల అభ్యర్థులు ఇందుకు అర్హులన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ధృవపత్రాలు, ఫొటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఆయన సూచించారు.
రాయచోటి టౌన్: మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం, సమాజం వృద్ధి చెందుతుందని డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మినరసయ్య అన్నారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వస్త్ నారీ సశక్త్ అభియాన్ కార్యక్రమాన్ని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో రాయచోటి ఏరియా ఆస్పత్రిలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్లలకు పాల ద్వారా బలమైన ఆహారం అందుతుందన్నారు. మహిళలు సమయానుకూలంగా వైద్యుల సేవలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం స్టేట్ అబ్జర్వర్ మధుకర్, డాక్టర్ డి. సంద్య, డాక్టర్ శివప్రతాప్, ఏరియా ఆస్పత్రి సూపరిడెంటెంట్ డాక్టర డేవిడ్ సుకుమార్, ఐసీడీఎస్ పీడీహైమావతి, దేవశిరోమణి తదితరులు పాల్గొన్నారు.