
కష్టపడి పనిచేసేవారికి విశ్వకర్మ ఆదర్శం
రాయచోటి: వృత్తులకు ఆధ్యుడైన దైవిక వాస్తుశిల్పి విశ్వకర్మ కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆయను స్ఫూర్తిగా తీసుకుని చేతి, కుల వృత్తుల వారు తమలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని డీఆర్‌ఓ మధుసూదన్ రావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించారు. డిఆర్‌ఓ మధుసూదన్ రావు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని, పాడవులకోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతోపాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారు చేశారన్నారు. విశ్వకర్మను దివ్య వడ్రంగి అని కూడా భావిస్తుంటారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి సురేష్, కలెక్టరేట్ ఏఓ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
ఘన నివాళి: విశ్వకర్మ భగవానుడు కేవలం దేవతల శిల్పి మాత్రమే కాదని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఆదర్శమని జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి అభిప్రాయపడ్డారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబల్లి ఆదేశాల మేరకు రాయచోటిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విశ్వకర్మ చిత్రపటానికి అదనపు ఎస్పీ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. విశ్వకర్మను నిర్మాణ శాస్త్రానికి సృష్టికర్తగా (ఆర్కిటెక్చర్), ఆధ్యుడిగా భావిస్తారన్నారు. చేతి వృత్తుల కళాకారులు, ఇంజినీర్లు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలు వంటి వారందరికీ విశ్వకర్మ స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. కార్యక్రమంలో ఏఆర్‌డీఎస్పీ ఎం శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు విజె రామకృష్ణ, ఎం పెద్దయ్య, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీసులు అధికారులు పాల్గొన్నారు.