
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత
రాయచోటి: జిల్లా ప్రజల భద్రతను కాపాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి తెలిపారు. జిల్లా నూతన ఎస్పీ ధీరజ్ కనుబిల్లి బుధవారం విజయవాడలోని డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. నేరాల నివారణకు పటిష్ట చర్యలు, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు సురక్షితంగా ఉండే వాతావరణం కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కఠిన నిబంధనలు అమలుతోపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించినట్లు పేర్కొన్నారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచేలా పారదర్శక సేవలు అందించాలని, నేరస్తులకు కఠిన శిక్ష, ప్రజలకు న్యాయం జరిగేలా చూడటమే పోలీసు వ్యవస్థ లక్ష్యమని సూచించినట్లు తెలియపరిచారు. డీజీపీ ఆదేశాల మేరకు ప్రజల భద్రత, న్యాయం, శాంతి స్థాపనలో తన వంతు కృషి చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.