
ఐదుగురు నిందితులకు జైలు శిక్ష
సిద్దవటం : దొంగనోట్ల మార్పిడి కేసులో ఐదుగురు నిందితులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ బద్వేల్ జడ్జి పద్మశ్రీ మంగళవారం తీర్పు వెలువరించినట్లు ఎస్‌ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ సిద్దవటం మండలం మాధవరం–1 గ్రామ పంచాయతీలోని సాయి వైన్స్ షాపులో 2010లో కర్నూలు జిల్లా బనగానపల్లికి చెందిన యు.మాధవరెడ్డి, ఎం.షర్పుద్దీన్, టి.వెంకటేశ్వర్లు, ఎస్.అల్తాఫ్, ఎస్.హుస్సేన్‌వల్లి వేయి రూపాయల దొంగనోటు ఇచ్చి చెలామణి చేశారు. వైన్ షాపు క్యాషీయర్ జయ నరసింహులు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ బొజ్జప్ప కేసు నమోదు చేయగా ఒంటిమిట్ట సీఐ రవిబాబు విచారణ చేశారు. తొమ్మిది మందిని అరెస్టు చేయగా సదరు కేసు బద్వేల్ అడిషనల్ అసిస్టెంట్ సెషన్ కోర్టు జడ్జి వై పద్మశ్రీ విచారించి ఒక్కొక్కరికి ఏడు సంవత్సరాల సాధారణ జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇద్దరిపై నేరం రుజువు కానందున కేసు కొట్టి వేయడం జరిగిందన్నారు. సాక్షాధారాలతో నేరం రుజువు చేసి ఐదుగురికి శిక్షపడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ షెల్కే నితికేత్ విశ్వనాథ్ అభినందించారు.