
వివాహిత ఆత్మహత్యాయత్నం
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరు పంచాయతీ గొల్లపల్లికి చెందిన వివాహిత గాయత్రి(30) ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు ఎస్‌ఐ హరిహరప్రసాద్ తెలిపారు. సదరు మహిళ మంగళవారం పొలం వద్దకు వెళుతూ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి అపస్మారకస్థితికి చేరుకోగా బాధిత కుటుంబీకులు చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారన్నారు. ఆత్మహత్యా యత్నానికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఓ వ్యక్తి మృతిచెంది ఉండడాన్ని గ మనించి స్థానికులు పోలీసులకు తెలిపారు. టూ టౌన్ పోలీసులు అతడి మృతిపై విచారించారు. గుర్తు తెలియని వ్యక్తి చుట్టుపక్కల యాచిస్తూ ఉండేవాడని చెప్పడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతిచెందిన వ్యక్తి బ్లూ కలర్ గళ్లలుంగీ, గోధుమ కలర్ షర్ట్ ధరించి ఉన్నాడని, సంబంధీకులు ఉంటే టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ తెలిపారు.
బొలేరో ఢీకొని
వృద్ధురాలు మృతి
మదనపల్లె రూరల్ : బొలేరో ఢీకొని వృద్ధురాలు మృతిచెందిన ఘటన మంగళవారం కలకడ మండలంలో జరిగింది. కదిరాయనిచెరువు ఎస్టీ కాలనీకి చెందిన పెద్ద రెడ్డెప్ప భార్య జయమ్మ(64) మర్రిపాడు రోడ్డు మార్గంలో పొలం వద్దకు నడిచి వెళ్తోంది. బొంతలవారిపల్లె సమీపంలో బొలేరో వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబీకులు 108 అంబులెన్స్ వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కలకడ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
పిచ్చి కుక్క దాడిలో
వృద్ధురాలికి గాయాలు
రాయచోటి టౌన్ : పిచ్చి కుక్క దాడిలో లక్ష్మమ్మ(50)కు గాయాలయ్యాయి. రాయచోటి – సుండుపల్లె రోడ్డులో జగనన్న కాలనీ వద్ద అదే ప్రాంతానికి చెందిన లక్ష్మమ్మ నడచి వెళ్తుండగా వెనుక నుంచి పిచ్చికుక్క వచ్చి దాడి చేసింది. గాయాలైన ఆమెను స్థానికులు రాయచోటి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు రేబీస్ వ్యాధి టీకాలు వేశారు.
పోక్సో కేసులో
నిందితుడికి జైలు శిక్ష
సంబేపల్లె : మండలంలోని నారాయణరెడ్డిపల్లె గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన జడపాల వెంకటరమణకు కడప జిల్లా ప్రధానకోర్టు న్యాయమూర్తి సి.యామని మంగళవారం శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు జడపాల రమణ 2021లో నారాయణరెడ్డిపల్లెకు చెందిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ క్రమంలోనే రమణకు జిల్లా ప్రధాన కోర్టు న్యాయమూర్తి మూడేళ్ల జైలుశిక్ష రూ.20 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.

వివాహిత ఆత్మహత్యాయత్నం