
వరి రైతు విలవిల..
రాయచోటి : వర్షాకాలంలో తెగుళ్లతో వరి రైతు నష్టపోతున్నాడు. ఇప్పటికే యూరియా బస్తాల కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు ఇపుడు తమ వరి పైరుకు తెగుళ్లు సోకడంతో లబోదిబోమంటున్నారు. గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో మార్పులకు వరి పంటకు కంకినల్లి, దోమ, ఆకు ఎండుతెగుళ్లు సోకాయి. వరి కర్రలు ఎర్రబారిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగు 11432 హెక్టార్లకుగానూ, లోటు వర్షపాతం కారణంగా ప్రస్తుతం 4154 హెక్టార్లలో వరి సాగు చేశారు. 11 వేల ఎకరాలలో టమాట, 5వేల ఎకరాల్లో వంగ, మిరప పంటలు సాగుచేశారు. ఈ సారి వరిపంటకు తెగుళ్లు బెడద తీవ్రమైంది. వెలిగల్లు, పింఛా ప్రాజెక్టు క్రింద ఆయకట్టు, మదనపల్లి వాయల్పాడు, పీలేరు ప్రాంతాలలో చెరువుల కింద కొంతమేర, బావులు, బోరుబావుల్లో నీరు ఉన్న రైతులు వరిసాగు చేశారు. వరిపొట్ట దశకు వస్తుండటంతో క్రిమి కీటకాలు ఎక్కువయ్యాయి. కంకినల్లి, దోమ, ఆకు, ఎండు తెగుళ్లకు రైతులు మందులను పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికే దున్నడానికి, నాటు వేయడానికి ఎరువులకు పెట్టుబడి పెట్టి సతమతమవుతుంటే కొత్తగా తెగుళ్లు రావడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.
వరికి తెగుళ్లు సోకాయి.....
వరికి దోమ, కంకినల్లి, ఆకు ఎండుతెగుళ్లు సోకాయి. మందులను ఇప్పటికే పిచికారీ చేశాం. వాతావరణ మార్పులతో వరి పొట్ట దశలో ఉండగా రోగాలు వస్తున్నాయి. పెట్టుబడులు తడిసి మోపడయ్యాయి. దీనికి తోడు యూరియా దొరకడం లేదు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– బాలకృష్ణారెడ్డి, రైతు, పెద్దకాలవపల్లి