
ఆర్టీపీపీ నుంచి గుట్టుగా స్క్రాప్ తరలింపు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు పరిశ్రమ నుంచి గుట్టు చప్పుడు కాకుండా పాత ఇనుము (స్క్రాప్)ను కొందరు బయటికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆర్టీపీపీలోని 600 మెగావాట్ల ప్రాజెక్టు పనులు కొన్నేళ్ల కిందట పూర్తి అయ్యాయి. అందులో భాగంగా స్క్రాప్ (పాత ఇనుప ముక్కలు) నిలువ పేరుకుని పోయింది.
అయితే ఇలా పక్కన పడి ఉన్న స్క్రాప్‌ను పరిశ్రమ యజమాన్యం టెండర్ల ద్వారా అమ్మకం వీలు ఉన్నప్పటికీ.. ఏ కారణం చేతనో చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా ఎన్‌డీఏ కూటమికి చెందిన కొందరు స్క్రాప్‌పై కన్నేశారు. సంబంధిత అధికారులకు రాజకీయ వత్తిళ్లు కూడా లేకపోలేదు. గుట్టు చప్పుడు కాకుండా స్క్రాప్ బయటకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని కార్మిక వర్గాల ద్వారా తెలుస్తోంది. తాజాగా ఆర్టీపీపీ నుంచి బయటికి వెళ్తున్న స్క్రాప్ వాహనాన్ని పట్టుకోవడం, వదిలి పెట్టడటం కూడా జరిగిందని తెలుస్తోంది. సంబంధిత అధికారులపై రాజకీయ వత్తిళ్లు రావడంతో ఆ వాహనాన్ని వదిలేసినట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. పట్టుకున్న వాహనం సచివాలయ వద్ద ఉంచి మంతనాలు చేసిన తర్వాత.. వదిలి వేసినట్లు సమాచారం. కూటమి నేతలు ఆర్టీపీపీని ఆదాయ వనరుగా మర్చుకున్న విషయం బహిరంగ రహస్యం. ఆర్టీపీపీలో పని చేస్తున్న కొందరి సహాయ సహాకారాలు ఉండటం వల్ల స్క్రాప్ సులువుగా బయటకు పోతుంది. ఆర్టీపీపీ ప్రధాన గేట్ల వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయని, ఏ విధంగా బయటికి పోతుందో సులువుగా తెలుసుకోవచ్చు. అయినా ఏ కారణం చేతనో సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు విధినిర్వహణలో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయంపై ఆర్టీపీపీ సీఈ వాసుదేవరావును వివరణ కోరాగా.. ఆరా తీస్తామన్నారు. ఈ వ్యవహారం తన దృష్టికి రాలేదన్నారు. ఏదిఏమైనా విచారణ చేస్తామని, సంబంధిత వారిపై చర్యలు ఉంటాయన్నారు. అనంతరం కలమల్ల ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు. అయినా ఆర్టీపీపీలోని అన్ని విభాగాల అధికారులతో సంప్రదించి విచారణ చేస్తామన్నారు. ఆర్టీపీపీ అధికారులు ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేపడుతామని తెలిపారు.