
నా బిడ్డను కాపాడండి
● అరుదైన వ్యాధితో బాధపడుతున్న
నాగచైతన్య
● ప్రభుత్వం సహకరించాలంటూ
తల్లి వేడుకోలు
సుండుపల్లె : అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడు నాగచైతన్య(15)కి మెరుగైన వైద్యం అందించి కాపాడాలని తల్లి బోనంశెట్టి సుమలత ప్రభుత్వం, దాతలను వేడుకుంటోంది. వివరాలలోకి వెళ్లితే.. సుండుపల్లె మండల పరిధిలోని దిన్నెమీద బలిజపల్లి గ్రామానికి చెందిన బోనంశెట్టి నాగచైతన్య ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పది రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో రాయచోటిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చూపించారు. జ్వరం తగ్గకుండా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో.. మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీకి తీసుకువెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఇతనికి బోన్ బ్లడ్ క్యాన్సర్ వ్యాధిగా నిర్ధారించారు. చికిత్స కోసం దాదాపు రూ.60 లక్షల వరకు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పడంతో.. ఆ నిరుపేద కుటుంబ సభ్యులు ఎటూతోచని దీనస్థితిలో కుప్పకూలిపోయారు. తన భర్త జీవనోపాధి కోసం కువైట్ దేశంలో పని చేసుకుంటూ జీవనాన్ని నెట్టుకొస్తున్నాడని, తమ బిడ్డకు ఈ వ్యాధి రావడంతో ఏమి చేయాలో తమకు దిక్కు తోచడం లేదని ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. ప్రభుత్వం తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని ఆమె ప్రాధేయపడుతోంది. దాతలు కూడా ముందుకు వచ్చి తమ బిడ్డ వైద్యానికి సహాయం చేయాలని ఆమె వేడుకుంటోంది.