
గురుకుల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
కడప రూరల్ : తన కుమారుడు కన్ను పోవడానికి కారణమైన రిషి వాటిక వ్యక్తి వెంకటేష్ వేద వ్యాస భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే రిషి వాటిక గురుకుల యాజమాన్యంపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కొండా అమర్నాథ్‌రెడ్డి కోరారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండల పరిధిలోని గట్టు గ్రామం వద్ద ఉన్న శ్రీ వేద వ్యాసా భారతీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిషి వాటిక గురుకులంలో మూడవ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడని తెలిపారు. ఇతర విద్యార్థులతో కలిసి ఆడుకుంటూ ఉండగా గురుకుల యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తి వెంకటేష్ రాయితో తన కొడుకును కొట్టడంతో కన్ను పోయిందని ఆలస్యంగా తెలిసిందన్నారు. చికిత్స చేయించినా.. కంటి చూపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు కట్టలేదన్న కోపంతోనే ఈ ఘటన జరిగిందని తన కుమారుడు తెలిపారని చెప్పారు. విషయం తెలుసుకునేందుకు స్కూల్‌కు వెళితే తననే చంపుతానని బెదిరించారని చెప్పారు. తనకు, తన కుమారునికి గురుకుల యాజమాన్యం నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. పోలీసులు నామమాత్రం సెక్షన్ల కింద కేసు పెట్టి చేతులు దులుపుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరారు.