
నూతన ఎస్పీ బాధ్యతల స్వీకరణ
రాయచోటి : అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా ధీరజ్ కనుబిల్లి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఉదయం రాయచోటిలోని జిల్లా ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఎస్పీకి పోలీసు యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా తన సతీమణితో కలిసి ఎస్పీ బాధ్యతలను స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా ఎస్పీగా పనిచేసిన విద్యాసాగర్ నాయుడు కృష్ణాజిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహించిన ధీరజ్ కనుబిల్లి ఇక్కడి వచ్చారు. ఈ సందర్భంగా ఏఆర్ సిబ్బందితో ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు.
నేపథ్యం ఇదీ..
ధీరజ్ కనుబిల్లి 2020 బ్యాచ్‌లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. 2021లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. వీరి తల్లి పార్వతీ (గృహిణి), తండ్రి కె వెంకటరమణ. అడిషనల్ ఎస్పీగా శ్రీకాకుళం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఐఏఎస్‌గా ఎంపికై నా తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ఐపీఎస్‌గా కొనసాగుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.ఎస్పీని జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, మదనపల్లె డీఎస్పీ ఎస్ మహేంద్ర, రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, ఏఆర్ డీఎస్పీ ఎం శ్రీనివాసులు కొత్త ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా ప్రత్యేకతను కాపాడతాం....
రాయచోటి : జిల్లా ప్రత్యేకతను కాపాడటంతో పాటు శాంతి భద్రతల విషయంలో నిక్కచ్చిగా విధులు నిర్వర్తిస్తామని నూతన ఎస్పీ ధీరజ్ కనుబిల్లి పేర్కొన్నారు. సోమవారం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు, మహిళల సంరక్షణ, సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను చట్టపరంగా వేగంగా పరిష్కరిస్తామని తెలిపారు.
ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపట్ల అలసత్వం చేయకుండా చట్టపరిధిలో పరిష్కారం చూపాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు.