
15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వీరబల్లి (సుండుపల్లె): అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 15 ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలలోకి వెళ్లితే.. సానిపాయి అటవీ ప్రాంతంలో అప్పయ్యగారిపల్లి సమీపంలో తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు సుబ్బరాయుడు, ఆర్‌ఎస్‌ఐ లింగాధర్ టీం కూంబింగ్ చేపట్టింది. అక్కడ రెండు కార్లలో కొందరు ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని చుట్టుముట్టగా పారిపోవడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. వారిని వెంబడించి 15 మంది నిందితులను పట్టుకుని తనిఖీ చేయగా 15 ఎర్రచందనం దుంగలు లభించాయని పేర్కొన్నారు. పట్టుబడిన వారు అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన వారుగా గుర్తించామన్నారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాసులు విచారించినట్లు తెలిపారు. అనంతరం సీఐ సురేష్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.