
విష జ్వరంతో చిన్నారి మృతి
ఓబులవారిపల్లె : మండలంలోని వైకోట గ్రామానికి చెందిన అంకిపల్లి చందన (08) అనే చిన్నారి విష జ్వరంతో గురువారం సాయంత్రం మృతిచెందింది. బంధువుల కథనం మేరకు.. అంకిపల్లి విజయ్, రాజేశ్వరీ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె చందన. వివాహం జరిగిన 18 ఏళ్ల తరువాత చందన పుట్టడంతో గారాబంగా ెపెంచుకున్నారు. బ్రతుకుదెరువుకోసం చిన్నారి తల్లిదండ్రులు గల్ఫ్ దేశానికి వెళ్లగా పెద్దనాన్న సుబ్రహ్మణ్యం వద్ద చందన ఉంటూ స్థానిక ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. గురువారం మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లిన చందన రెండుసార్లు వాంతులు కావడంతో ఉపాధ్యాయులు ఇంటికి పంపారు. హుటాహుటిన రైల్వేకోడూరు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ 105 డిగ్రీల జ్వరం చూపించింది. దీంతో పాపకు వాయువు వచ్చింది. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చిన్నారి మృతిచెందింది. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు గల్ఫ్ దేశం నుంచి స్వదేశానికి బయలుదేరారు. చందన మృతితో వైకోట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల వర్షం కురవడంతో చెత్తా చెదారం కుళ్లి వారం రోజుల నుండి దోమలు అధికం కావడంతోవైకోట గ్రామంలోని ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు.
అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
రాజంపేట : అటవీ అమరవీరులు త్యాగాలు మరువలేనవని జిల్లా అటవీశాఖాధికారి జగన్నాథసింగ్ అన్నారు. జిల్లా అటవీశాఖ కార్యాలయం(రాజంపేట)లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. డీఎఫ్‌ఓ క్యాంపస్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా అటవీ ఉద్యోగులనుద్దేశించి డీఎఫ్‌ఓ మాట్లాడుతూ అటవీశాఖలో సేవలందిస్తూ ప్రాణాలు పొగొట్టుకున్నవారిని ఆ శాఖ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. అటవీ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు పాల్గొన్నారు.
బంగారం చోరీ
పెనగలూరు : మండలంలోని వడ్డి కాలనీ వద్ద జయమ్మ ఇంట్లో 13 తులాల బంగారం, పదివేల రూపాయలు నగదును దొంగలు అపహరించినట్లు ఎస్‌ఐ రవి ప్రకాష్ రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. జయమ్మ కుటుంబ సభ్యులు ఆదివారం ఇంటికి తాళం వేసి కడపలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి బుధవారం రాత్రి వచ్చి చూడగా ఇంటి తలుపులు పగులకొట్టి ఉన్నాయి. బీరువా తాళాలు పగులకొట్టి బంగారు, నగదు అపహరించినట్లు గుర్తించి ఆమె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాయచోటి నుంచి క్లూస్ టీమ్ వచ్చి పరిశీలించింది. బంగారు చోరీ కేసు సీఐ బివి.రమణ విచారిస్తున్నట్లు తెలిపారు. షాపులలో సీసీ కెమెరాలు బిగించుకోవాలని ఎస్‌ఐ రవిప్రకాష్ రెడ్డి కోరారు.
వాహనం ఢీకొని రైతుకు తీవ్రగాయాలు
బి.కొత్తకోట : పనిమీద బి.కొత్తకోటకు వచ్చి బైక్ పై తిరిగి వెళుతున్న రైతును గురువారం రాత్రి స్థానిక రంగసముద్రం రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. వివరాలు..పీటీఎం మండలం రంగసముద్రంకు చెందిన రైతు సవరాల అన్నయ్య(60) సొంత పనిమీద బైక్ పై బి.కొత్తకోటకు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా రంగసముద్రం రోడ్డులోని పెట్రోలు బంకు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీనితో అపస్మారక స్థితికి చేరుకున్న బాధితున్ని మదనపల్లెకు తరలించగా మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో...
గాలివీడు : మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయలయ్యాయి. నూలివీడు నుంచి గాలివీడు వైపు వస్తున్న టెంపో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం పరస్పరం ఢీ కొన్నాయి. ఇరువురికి గాయాలవడంతో క్షతగాత్రులను 108 వాహనంలో రాయచోటి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పశువులు అడ్డొచ్చి..
మదనపల్లె: ఓ మహిళ బైక్ మీద పశువులు అడ్డొచ్చి ప్రమాదాన్ని గురైన ఘటన గురువారం రాత్రి జరిగింది. తంబళ్లపల్లె మండలం కుక్కరాజుపల్లికి చెందిన అనురాధ ( 33) కురబలకోట మండలం ముదివేడులో నర్సరీ నిర్వహిస్తోంది. పనులు ముగించుకొని రాత్రి ఇంటికి బైక్ మీద వెళుతుండగా ముదివేడు వద్ద పశువులు ఒక్కసారిగా అడ్డు రావడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురి కావడంతో గాయపడింది. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థినికి జాతీయ పురస్కారం
సుండుపల్లె : కేరళ రాష్ట్రం కొచ్చిన్‌లో ఆల్‌ఏజీ గ్రూప్ జిమ్నాస్టిక్స్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో సుండుపల్లి వాసి కూరపాటి మౌక్తిక ప్రతిభ చూపారు. గ్రూపు, సింగిల్ విభాగాల్లో ద్వితీయ స్థానంలో నిలిచి జాతీయ పురస్కారం దక్కించుకున్నారు. సుండుపల్లె సాయన్నగారిపల్లెకు చెందిన రంగనాథ్‌బాబు కుమార్తె బెంగళూరు సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నారు. కేరళలో జరిగిన జిమ్నాస్టిక్ చాంపియన్స్ పోటీలలో ప్రతిభ కనపరిచి నేషనల్ అవార్డు అందుకున్నారు.

విష జ్వరంతో చిన్నారి మృతి