
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే.. కేసులా?
రాయచోటి : సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అణచివేసేలా కలెక్టర్, ఎస్పీలు అక్రమ కేసులు బనాయించడం సరికాదని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మహేష్ అన్నారు. సీపీఐ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ కమ్యూనిస్టులపై దేశంలో చేయని కుట్రలు, పెట్టని కేసులు లేవన్నారు. సమస్యలపై పోరాటాలు చేసే సందర్భంలో లాఠీ దెబ్బలు పడినా, తూటాలు పేలినా రక్తాన్ని చిందించడమేగానీ, వెనుకడుగు వేయలేదని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరకు అవస్థపడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. ఎనభై శాతం యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలిందంటూ సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 8న వందలాది మంది రైతులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. దీనిపై కేసులు పెట్టని పోలీసులు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన వారిపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. యూరియా పుష్కలంగా ఉంటే ఎందుకు రైతులకు టోకెన్లు ఇచ్చి సచివాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ప్రశ్నించారు. మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల చుట్టూ రైతులు తిరగడం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. మదనపల్లి బీటీ కళాశాలను యూనివర్సిటీగా మారుస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటను అమలు చేయాలని అడిగిన ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శిని స్టేషన్‌లో విచక్షణారహితంగా కొట్టడం సిగ్గు చేటన్నారు. మంత్రుల పర్యటనల సమయంలో కమ్యూనిస్టులను గృహనిర్భంధాల పేరుతో అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సబబు అని పేర్కొన్నారు. కోడూరు ప్రాంతంలో బొప్పాయి పండించే రైతన్నకు మద్దతు ధర కల్పించాలని అడిగిన కమ్యునిస్టు నాయకులపైనా బైండోవర్ కేసులు పెట్టడం పోలీసుల చేతకానితనానికి నిదర్శనమన్నారు. రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబరుకు ఎనిమిది ఫిర్యాదులందినా వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని కలెక్టర్, ఎస్పీలను ఆయన ప్రశ్నించారు. జిల్లాలో భూ కబ్జాదారులు పెరిగిపోయి ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా దోచుకుంటున్న వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదన్నారు. ఎస్‌ఐలను పోలీసు స్టేషన్‌లో అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నా కేసులు పెట్టని ఎస్పీ ప్రజలు, రైతుల సమస్యలపైన నిరసన తెలిపిన వారిపై నమోదు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కలెక్టర్, ఎస్పీలపై దశలవారీగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాల శ్రీనివాసులు, మండెం సుధీర్, పి.కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి పి మహేష్