
చోరీ కేసులో ఏడాది జైలుశిక్ష
మదనపల్లె రూరల్ : చోరీ కేసుల్లో ముద్దాయికి మదనపల్లె రెండో అదనపు జ్యుడిషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ జే.కీర్తన, ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చారు. మదనపల్లె పట్టణం చంద్రాకాలనీకి చెందిన కావడి సోమశేఖర్, 2021లో టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో చోరీకి పాల్పడ్డారు. అప్పటి పోలీస్ అధికారులు క్రైమ్‌నెంబర్.64/2021, 969/2021 కేసులు నమోదుచేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం గురువారం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి రెండు చోరీ కేసుల్లోనూ 248(2) సీఆర్.పీ.సీ. కింద దోషిగా నిర్ధారిస్తూ ఏడాది పాటు సాధారణ జైలుశిక్ష, రూ.1,000 నగదు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. టూటౌన్ పోలీసులు నిందితుడిని సబ్‌జైలుకు తరలించారు.
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్): అప్పులబాధ తాళలేక రామాపురం మండలం రాచపల్లె పంచాయతీ వడ్డెపల్లికు చెందిన కుంచపు నాగేంద్ర(35) ఆత్మహత్య చేసుకున్నట్లు రామాపురం పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. కుంచపు నాగేంద్ర ఎక్కువగా అప్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు కలరు.

చోరీ కేసులో ఏడాది జైలుశిక్ష