
మదనపల్లె : భార్యను ఇంటికి తీసుకొచ్చేందుకు బైక్ పై వెళ్తున్న భర్త దుర్మరణం పాలైన ఘటన గురువారం రాత్రి మదనపల్లె రూరల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..మదనపల్లె ఎస్టేట్లో కాపురం ఉంటున్న వి.నాగార్జున (29) చేనేత కార్మికుడుగా పనిచేస్తూ జీవిస్తున్నాడు.
వాల్మీకిపురం మండలం చింతపర్తిలో ఉన్న తన భార్య లావణ్యను ఇంటికి తీసుకొచ్చేందుకు బైక్ పై చింతపర్తికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో కాశీరావుపేట వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం నాగార్జున ను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగార్జున అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మదనపల్లె రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలు
మదనపల్లె : గర్భిణీ అయిన భార్య ఆస్పత్రికి తరలించగా.. ఆమె కోసం బైక్ పై మదనపల్లి వస్తున్న భర్త, అతని మిత్రుడు ప్రమాదానికి గురైన ఘటన గురువారం రాత్రి కురబలకోట మండలం అంగళ్లు వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు. బి.కొత్తకోటకు చెందిన శ్రీనాథ్ భార్య గర్భిణీ కావడంతో ఆమెను మదనపల్లె ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె వద్దకు వెళ్లేందుకు శ్రీనాథ్.. ములకల చెరువుకు చెందిన మిత్రుడు సురేష్ తో కలిసి బైక్ మీద బి.కొత్తకోట నుంచి మదనపల్లె కు బయలుదేరారు.
మార్గ మధ్యంలో కురబలకోట మండలం అంగళ్లు హైవే పై వెళ్తుండగా వెనుక వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీకొంది. దీనితో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 సిబ్బంది మస్తాన్, మనోహర్ స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఒకరిని తిరుపతికి రెఫర్ చేశారు.