
రేషన్ కోసం వెళ్తూ... కారు ఢీకొని వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : ఇంటింటికీ బియ్యం వాహనం ప్రభుత్వం రద్దు చేయడంతో రేషన్ బియ్యం తెచ్చుకోవాలని వెళ్తూ కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందగా, అతని మనవరాలు గాయపడిన సంఘటన బుధవారం సాయంత్రం మదనపల్లెలో జరిగింది. బి.కె.పల్లెలో చిల్లర దుకాణం నిర్వహిస్తున్న బుడెన్‌సాబ్ కుమారుడు మస్తాన్(59) స్థానిక రేషన్ దుకాణానికి, మనవరాలు సమీహకౌసర్(09)తో కలసి ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు. బైపాస్ రోడ్డులోని చంద్ర కాలనీ వద్ద, అనంతపురం నుంచి తిరుపతి వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో మస్తాన్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లగా, మనవరాలు గాయపడింది. స్థానికులు బాధితులను స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన ఆసుపత్రి వైద్యులు మస్తాన్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు సంఘటన స్థలం వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు. కాగా మృతునికి భార్య హబీబున్నీసా, ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు.