
పరస్పర సవాళ్ల నేపథ్యంలో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయం
పుత్తా వర్సెస్ రెడ్డెమ్మ వర్గీయులు బలప్రదర్శన
నూతన బార్ ఏర్పాటును అడ్డుకున్న కడప ఎమ్మెల్యే వర్గీయులు
సాక్షి ప్రతినిధి, కడప: కడప టీడీపీలో అసమ్మతి పోరు ముదిరింది. కడప కేంద్రంగా పరస్పర బలప్రదర్శనల జోరు ఊపందుకుంది. కమలాపురం , కడప నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నేతల మధ్య రగడ తీవ్ర స్థాయికి చేరింది. వరుస వివాదాలు నేపథ్యంలో ఏకంగా టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠానికి ఎసరు పెట్టారు. అధ్యక్షుడి మార్పు జరగాల్సిందేనంటూ ఓ వర్గం మంకు పట్టుబట్టింది.
జిల్లా కేంద్రమైన కడపలో మునుపెన్నడూ లేని పరిస్థితులు కూటమి సర్కార్ 16 నెలల కాలంలో తెరపైకి వస్తున్నాయి. ‘మద్యం వ్యాపారం మా వర్గీయులే చేయాలంటూ’స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు హుకుం జారీ చేయసాగారు. 30 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో లక్ష్మిరెడ్డికి చెందిన రెండు బార్లు బలవంతంగా స్వాహా చేశారు. తాజాగా 27 బార్ల లైసెన్స్‌కు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తే కేవలం 14 బార్లుకు మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. 13 బార్లకు సంబంధించి టెండర్లు పెండింగ్‌లో ఉన్నాయి. కడప కోటిరెడ్డి సర్కిల్ సమీపంలో బార్ ప్రారంభోత్సవానికి ప్రయత్నించగా, ఎమ్మెల్యే మాధవీరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఇక్కడ బార్ పెట్టొద్దంటూ హంగామా చేశారు. ఇరువర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి బ్యానర్లతో వాహనాల్లో వచ్చిన కొంతమంది అక్కడి చేరుకొని పరస్పర సవాళ్లు చేసుకున్నారు. దీంతో కడప ఎమ్మెల్యే వర్గీయులు అక్కడి నుంచి జారుకున్నట్లు సమాచారం. కాగా, జిల్లా కేంద్రంలో నియంతృత్వ పోకడలకు చెక్ పెట్టాలనే దిశగా టీడీపీ నేతలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ అధ్యక్ష పీఠానికి ఎసరు
జిల్లా కేంద్రమైన కడపలో ఏకపక్ష చర్యలకు చెక్ పెట్టాలని తెలుగుదేశం పార్టీలో కొంతమంది నడుం బిగించారు. అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠం మార్పు చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డికి తోడుగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఉండడంతో ప్రజాస్వామ్య పరిస్థితులను కాలరాస్తున్నారని కొంతమంది టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆమేరకు ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను ఉదహరించినట్లు తెలుస్తోంది. పొలిట్‌బ్యూరో సభ్యుడుగా జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులరెడ్డికి రెండు పదవులు ఉన్న నేపధ్యంలో అధ్యక్ష పీఠం తప్పించాలని కోరినట్లు సమాచారం. ఆమేరకు టీడీపీ అధిష్టానం సైతం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాగా, జిల్లా అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందనే అన్వేషణలో జమ్మలమడుగు ఇన్‌చార్జీ చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. టీడీపీలో భూపేష్‌రెడ్డి అందరీకి ఆమోదయోగ్యడుగా నిలువనున్నట్లు అధిష్టానం అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.