
మదనపల్లె వైద్య కళాశాలకు టెండర్
మదనపల్లె: మదనపల్లె ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానంలో ప్రయివేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం తొలి అడుగు వేసింది. మదనపల్లెతోపాటు మరో మార్కాపురం, ఆదోని, పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలను మొదటి విడతలో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య పద్ధతిలో అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించి మంగళవారం జీవో జారీ చేసింది. ఈ అప్పగింత ప్రక్రియకు సంబంధించిన బాధ్యతలను వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ)కు ప్రభుత్వం అప్పగించింది. వీటికి సంబంధించి కమర్షియల్ ఫీజిబిలిటీ అధ్యయనం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. పీపీపీ కింద నిర్వహణ బాధ్యతలు చూసేందుకు ముందుకు వచ్చే టెండర్‌దారునికి వార్షిక ఫీజులకు సంబంధించి రాయితీలు కూడా వర్తింపజేస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే పీపీపీ కింద మెడికల్ కళాశాలను దక్కించుకునే వారికి.. ప్రభుత్వం భారీగానే ప్రోత్సాహకాలను అందిస్తుందన్న విషయం అర్థమవుతోంది. దీనికి సంబంధించిన విధి విధానాలు, ఇతరా అంశాలను జీవోలో పొందుబరిచారు.
పీపీపీ విధానంలో అప్పగిస్తామని జీవో జారీ చేసిన ప్రభుత్వం
ఏడాది ఫీజులో రాయితీలు ఇస్తామంటూ ప్రకటన
టెండర్‌దారునికి భారీగా ప్రోత్సాహం
మదనపల్లె ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రయివేటుకు అప్పగించవద్దని ప్రజల నుంచే కాకుండా రాజకీయ పార్టీలు, సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన ఈ కళాశాలకు రూ.475 కోట్లతో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రభుత్వ ఆస్పత్రిలో నడించించి, ప్రయివేటుకు వద్దని, సర్కారు ఆధీనంలోనే కళాశాలను నడపాలని డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. పరిశీలిస్తామన్న హామీ కూడా ఇవ్వలేని ప్రభుత్వం.. ఇప్పుడు నిర్ణయించినట్టుగానే ప్రయివేటుకు అప్పగింత ప్రక్రియలో భాగంగా జీవో జారీ చేయడంతో మదనపల్లె ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. దీనిపై ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.