
ఆలకించరు..ఆదుకోరు
● ప్రతి సోమవారం కలెక్టరేట్లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● బాధితులకు తప్పని ఇబ్బందులు
రాయచోటి టౌన్/ సంబేపల్లె : అనేక బాధలు వెంటాడుతున్నాయి.. కష్టాలు మెండుగా ఉన్నాయి..ఎన్ని పోరాటాలు చేసినా, ఎంత ఆవేదన వెలిబుచ్చినా న్యాయం దొరకక వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి బాధితులు పరుగులు తీస్తున్నారు. అయినా పరిష్కారం దొరకకడంలేదు. పదే పదే తిరుగుతున్నా ఫలితంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మూరుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రతిసోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎన్నెన్నో కష్టాలు, మరెన్నో అవస్థలు పడి ఇక్కడికి వస్తున్నారు.
న్యాయం చేయండి సారూ..
వీరి పేర్లు మార్గాని గంగులప్ప, మార్గాని నారాయణమ్మ.వీరిది అన్నమయ్య జిల్లా బి. కోత్తపేట. వీరికి ఒక కొడుకు ఉండే వాడు. రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. కోడలు కూడా వెళ్లిపోయింది. దీంతో ఒంటరిగా జీవిస్తున్నారు.వీరికి 4.43 ఎకరాల భూమి ఉంది. దానిని సాగు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. ఇతని తమ్ముడు భూమిని ఆక్రమించుకొనేందుకు సాగు చేసుకోవడానికి వీలు లేకుండా ఇబ్బంది పెడుతున్నాడు. మేము చనిపోతే అడిగే వారు ఎవరూ ఉండరని భావించి అటువైపు రానీయకుండా భయపెడుతున్నాడు. ఈ భూమిని మాకు దక్కేటట్లుగా చేయాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చామని చెబుతున్నారు.కలెక్టర్‌కు రెండుసార్లు ఫిర్యాదు చేశాం. అయినా ఫలితం లేదంటున్నారు. ఇప్పటికై నా ఈ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని వేడుకొంటున్నారు.
నా భూమిని ఆక్రమించారు
నా పేరు ముత్తన శ్రీరాములు, అన్నమయ్య జిల్లా బి. కోత్తపేట, నామాలపల్లె. మాకు పూర్వీకుల నుంచి మాకు 2.63 ఎకరాల భూమి ఉంది. దానిని మా తాత, మా నాన్న, ఇప్పుడు నేను సాగు చేసేవాడిని. అయితే కొంత కాలంగా ఆరోగ్యం బాగాలేక ఆ భూమిని సాగు చేయడంలేదు. దీంతో మా ఊరికి చెందిన ఇద్దరు వ్యక్తులు భూమిని ఆక్రమించారు.దీనిపై ఇప్పటి వరకు మూడు సార్లు జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశాం. అధికారులు వస్తారు..భూమిని చూస్తారు...అయినా భూమి మాకు దక్కలేదు. ఇప్పటికై న కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలి.

ఆలకించరు..ఆదుకోరు