
రైతుల కష్టాలు పట్టని ప్రభుత్వం
– వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి : రైతులకు న్యాయం చేయడంలో బాధ్యతగా ఉండాల్సిన కూటమి ప్రభుత్వం రైతుల బాధలు, కష్టాలను పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాయచోటిలో పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో రైతులపట్ల ప్రభుత్వ మొండి వైఖరిని తుర్పారా బట్టారు. రైతు భరోసా ఒకటిన్నర సంవత్సరానికి రూ.7 వేలు మాత్రమే ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కాకుండా సంవత్సరానికి రూ. 20 వేలు ఇస్తామని, ఎన్నికల సమయంలో కూటమి పార్టీ నేతలు చెప్పారన్నారు. ఈ సంవత్సరంతో కలిపి రైతులకు ఇంకా రూ. 33 వేలు బాకీ పడ్డారన్నారు. వీటిని వెంటనే రైతులకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు వేసుకోలేని దుర్భర పరిస్థితులు జిల్లాలో ఏర్పడ్డాయన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 15శాతమే పంటలు సాగయ్యాయన్నారు. 85 శాతం సాగు చేయాల్సిన భూములు బీళ్లుగా మారాయన్నారు. ఈ ఏడాది మామిడి, టమాట, కర్బూజ, దోస తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టాలను మూటకట్టుకున్నారని తెలిపారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటల బీమా మంజూరు ఊసేలేదన్నారు. తోతాపూరి మామిడిరైతులు ఖాతాలలో డబ్బులు జమ చేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
అన్నదాత పోరును విజయవంతం చేయాలి
రాష్ట్రంలో అనేక జిల్లాల్లో యూరియా కొరత నెలకొంది. దీంతో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈనెల 9న ఉదయం 9.30 గంటలకు అన్నదాత పోరు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని రైతు నాయకులు, రైతులు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.