
ప్రొటోకాల్‌కు తిలోదకాలు..!
● ఒంటిమిట్ట మండల సమావేశంలో
వేదికపై టీడీపీ ఇన్‌చార్జి
● అధికారులతో సమస్యలపై చర్చ
● ముక్కున వేలేసుకుంటున్న జనం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఒంటిమిట్ట మండల సర్వసభ్య సమావేశం ప్రొటోకాల్ తప్పింది. అంతేకాదు సమయపాలన కూడా అధికారులు పాటించలేదు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించాల్సిన సమావేశం 11 గంటలకు ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో జరగాల్సిన సమావేశం తెలుగుదేశం పార్టీ రాజంపేట ఇన్‌చార్జి చమర్తి జగన్‌మోహన్ రాజు, ఆయన అనుచరులతో కలిసి సంబంధిత అధికారులు నిర్వహించారు. సమావేశానికి హాజరైన చమర్తి జగన్ మోహన్ రాజు పలు శాఖల అధికారులతో ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. అనంతరం చమర్తి మాట్లాడుతూ ఎంపీపీ ఆహ్వానం మేరకే తాను సమావేశానికి హాజరయ్యానని తెలిపారు. ఇందులో నిబంధనలు, ప్రొటోకాల్‌ని ఉల్లంఘించింది ఏమీ లేదంటూ తనను తాను సమర్థించుకున్నారు. ఇదంతా చూసిన వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, మండల ప్రజలు సర్వసభ్య సమావేశం నిర్వహణ నియమాలను సంబంధిత అధికారులు మంట గలిపారని మండిపడుతున్నారు. ఇలా జరగడం మొదటిసారి ఏమీ కాదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మండల సర్వసభ్య సమావేశం ప్రొటోకాల్‌కు అర్థం లేకుండా పోయిందని పలు పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మండల ప్రజలు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు నామినేటెడ్ పదవులు ఉన్నవారు సైతం తాము ప్రజా ప్రతినిధులమంటూ సమావేశ భవనంలోకి అడుగుపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇలా సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా పాటించాల్సిన ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో ఒంటిమిట్ట ఎంపీపీ అక్కి లక్ష్మీదేవి, జెడ్పీటీసీ అడ్డలూరు ముద్దుకృష్ణారెడ్డి, ఎంపీడీఓ సుజాత, కోఆప్షన్ సభ్యుడు రఫీ, ఎంపీటీసీలు టక్కోలు లక్ష్మీ ప్రసన్న, ముమ్మడి నారాయణ రెడ్డి, బాషా, సుప్రియ, గీతాదేవీ, లక్ష్మీదేవి, సర్పంచ్‌లు కడప బాదుల్లా, బొడ్డే నాగమ్మ, లక్ష్మీనరసమ్మ, మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.