
కుప్పం వద్దు.. ఇక్కడే ఉందాం!
మదనపల్లె: హంద్రీ–నీవా కుప్పం డివిజన్‌న్–12 కార్యాలయాన్ని మదనపల్లె ఎస్‌ఈ కార్యాలయం నుంచి కుప్పం తరలించి అక్కడికి వెళ్లి విధుల నిర్వహించేందుకు అధికారులు విముఖత చూపుతున్నారు. 2018లో మంజూరైన డివిజన్ కార్యాలయాన్ని కుప్పంలో ఏర్పాటు చేయకుండా మదనపల్లె ఎస్‌ఈ కార్యాలయంలోనే నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిపై జూలై 31న సాక్షిలో ‘కదలరు..వదలరు’శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇన్నేళ్లుగా వెలుగులోకి రాకుండా సాగిపోతున్న వ్యవహారం బహిర్గతం కావడంతో అప్పటినుంచి కుప్పంకు వెళ్లకుండా ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతూ వస్తున్నారు. నెలరోజుల్లో పలు ఆసక్తికర విషయాలు చోటుచేసుకొంటున్నాయి. కుప్పం డివిజన్–12 ఈఈగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లుపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడం, మెమోల జారీకి ఆదేశించడం, తిరుపతి సీఈ చర్యలు తీసుకోవడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రి దృష్టికి ప్రాజెక్టు అధికారులు కుప్పం నుంచి విధులు నిర్వహించడం లేదని రావడంతో కుప్పం ఈఈ మదనపల్లె సర్కిల్ కార్యాలయం నుంచి విధులు నిర్వహించేందుకు అంగీకరించడం లేదని తెలిసింది. పని చేస్తున్న ఉద్యోగులు కుప్పం రావాలని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. దీంతోపాటు కార్యాలయ గదులకు తాళాలు కూడా వేసేశారు. అయినప్పటికీ కుప్పం వెళ్లేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంకు వెళ్లి విధులు నిర్వహించలేమని చెప్పి..మదనపల్లె నుంచి విధులు నిర్వహించేలా రాజకీయ నేతల ద్వారా ప్రయత్నాలు మొదలైనట్టు తెలిసింది. ఇందులో భాగంగా టీడీపీ నేతల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. డివిజన్ కార్యాలయం మదనపల్లెలోనే కొనసాగించి, సబ్ డివిజన్ పేరుతో ఒక చిన్న గదిలో కార్యాలయం ప్రారంభించి అక్కడ ఎవరినో ఒకరిని పంపి..కార్యాలయం తరలించామని చెప్పుకునేందుకు అవస్థలు పడుతున్నారు. లేనిపక్షంలో పూర్తిస్థాయిలో డివిజన్ కార్యాలయాన్ని తరలించడమే అని మధనపడుతున్నారు.
● కుప్పం ఉప కాలువకు సంబంధించి జరుగుతున్న కాంక్రీటు లైనింగ్ పనులు పూర్తయిపోయాయి కాబట్టి కుప్పం నుంచి విధులు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ కొందరు అధికారులు వింత వాదన లేవనెత్తారు. 2018లో మంజూరైన డివిజన్ కార్యాలయాన్ని ఇప్పటిదాకా కుప్పంలో ఏర్పాటు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది.
సీఎం అంగీకరిస్తారా
గత టీడీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న చంద్రబాబు తన నియోజకవర్గానికి మంజూరు చేసిన డివిజన్ కార్యాలయం మదనపల్లెలోనే కొనసాగేందుకు అంగీకరిస్తారా అన్నదానిపై చర్చించుకొంటున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ద్వారా సీఎంఓను సంప్రదించి ఈ విషయమై నిర్ణయం తీసుకోవాలని కోరితే అనుకూలమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉండదని చెబుతున్నారు. దీంతో డివిజన్ కార్యాలయాన్ని కుప్పం తరలించడమే బెటర్ అని కొందరు అధికారులు చెబుతున్నారు.
హంద్రీ–నీవా డివిజన్ తరలింపుపై మల్లగుల్లాలు