
కక్షసాధింపులో భాగంగానే మెడికల్ కాలేజీ ప్రైవేట్‌పరం
మదనపల్లె రూరల్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మెడికల్ కాలేజీలను కక్షసాధింపులో భాగంగానే కూటమిప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తోందని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నిసార్‌అహ్మద్ అన్నారు. మదనపల్లె మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై శుక్రవారం మండలంలోని ఆరోగ్యవరం వద్ద 95 ఎకరాల స్థలంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిర్మాణం తలపెట్టి, దాదాపు 80శాతానికి పైగా పనులు పూర్తయిన మెడికల్ కాలేజీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...రాజంపేట పార్లమెంటరీ పరిధిలో మంజూరైన మెడికల్ కాలేజీని పడమటి నియోజకవర్గాల ప్రజల వైద్యసేవల కోసం మదనపల్లెలో ఏర్పాటుచేసేలా చేయడంలో ఎంపీ మిథున్‌రెడ్డి కీలకపాత్ర పోషించారన్నారు. తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు అత్యవసర వైద్యసేవలకు 100కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి తిరుపతికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండటంతో స్థానికంగా మెడికల్ కాలేజీ ఏర్పాటుచేస్తే సౌకర్యంగా ఉంటుందని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఒప్పించి ఎంపీ మిథున్‌రెడ్డి మదనపల్లెకు కేటాయించారన్నారు. రూ.475 కోట్లతో పనులు ప్రారంభించి దాదాపు 80శాతానికి పైగా పనులు పూర్తయిన తరుణంలో కూటమిప్రభుత్వం అధికారంలోకి రావడం, కక్షసాధింపుల్లో భాగంగా పనులు నిలిపివేయడం జరిగిందన్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ, ప్రజాసంఘాల నాయకులు ఉద్యమిస్తే...స్థానిక టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, మెడికల్ కాలేజీ ఎట్టి పరిస్థితుల్లోనూ పీపీపీ విధానంలోకి వెళ్లదని, ఒకవేళ వెళితే...రోడ్డుమీదకు వచ్చి ఉద్యమిస్తానని హామీ ఇచ్చారన్నారు. హామీ నిలుపుకోవాలని కోరారు. మదనపల్లె మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రజాసంఘాలు, వామపక్షనాయకులతో కలిసి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించుకుని కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనిచ్చేది లేదని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించేలా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మనూజారెడ్డి, సర్పంచ్ ఈశ్వరయ్య, వెలుగుచంద్ర, పోతబోలు నాగరాజ, బొమ్మిశెట్టిమధు, కొత్తపల్లె మహేష్, సీపీఎం మురళీ, ఏఐఎస్‌ఎఫ్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త
నిసార్‌అహ్మద్