కడప గడపలో కృష్ణమ్మ సవ్వడులు! | - | Sakshi
Sakshi News home page

కడప గడపలో కృష్ణమ్మ సవ్వడులు!

Sep 2 2025 7:32 AM | Updated on Sep 2 2025 7:32 AM

కడప గడపలో కృష్ణమ్మ సవ్వడులు!

కడప గడపలో కృష్ణమ్మ సవ్వడులు!

సాక్షి ప్రతినిధి కడప : ‘బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను...బంగారు పంటలే పండుతాయి. ముత్యాల మురిపాలు దొరలుతాయి’.. ఇది శంకరంబాడి సుందరాచార్యులు రాసిన గేయం. ఇది ఒకనాటికి నిజమవుతుందని జిల్లా ప్రజలెవరూ ఊహించలేదు. మెట్ట ప్రాంతంలో కృష్ణా జలాలు పారిస్తే నా జన్మ ధన్యమని రాజోలి రిజర్వాయర్‌ శంకుస్థాపన సందర్భంగా ఆనాడే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్పష్టంగా చెప్పారు. ఆ మహానేత నిర్వహించ తలపెట్టిన జలయజ్ఞం ఫలితం సాకారమైంది. నీళ్లులేక నోళ్లు తెరచిన పులివెందుల నియోజకవర్గ బీడు భూములు పులకిస్తున్నాయి.

‘తండ్రి బావి తవ్విస్తే కుమారుడు పూడ్చేశాడన్నట్లుగా’ రాయలసీమ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 1988లో గాలేరు–నగరి, ఆ తర్వాత హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులను ప్రకటించి శంకుస్థాపన చేశారని నాటి రాయలసీమ ఉద్యమకారులు వివరిస్తున్నారు. ఆ తర్వాత అనూహ్యంగా అధికారిక పగ్గాలు చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఓ మాట.. తర్వాత మరోమాట చెబుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలికొదిలేశారు. ఆ విషయాన్ని చరిత్ర స్పష్టం చేస్తోంది. 1996 పార్లమెంటు ఎన్నికల ముందు ఓట్ల కోసం గండికోట ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆపై నిర్మాణాన్ని విస్మరించారు. మళ్లీ ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవాలి కనుక 1999 సాధారణ ఎన్నికలకు ముందుగా 1998లో వామికొండ వద్ద మరోమారు శంకుస్థాపన చేశారు. గద్దెనెక్కిన తర్వాత మళ్లీ విస్మరించారు. కృష్ణస్వామి కమిటీ వేసి జీఎన్‌ఎస్‌ఎస్‌కు గండికొట్టే ప్రయత్నాలు చేశారని విశ్లేషకులు వివరిస్తున్నారు. తన తొమ్మిదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టుకు ఆయన ఖర్చు చేసింది కేవలం రూ.67.50 కోట్లు మాత్రమే. అది కూడా సిబ్బంది జీతభత్యాలకు మాత్రమే. ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు ముందుకు సాగలేదు. అధికారిక గణాంకాల ద్వారా ఈ విషయం తేటతెల్లమవుతోంది. పైగా రాయలసీమ సాగు, తాగునీరు అందాలంటే శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల కనీస నీటిమట్టాన్ని ఉంచాలి. కాగా చంద్రబాబు సర్కార్‌ జీఓ నెంబర్‌ 69 జారీ చేసి శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 834 అడుగులకు కుదించడం ద్వారా రాయలసీమ మరణశాసనాన్ని లిఖించారని పలువురు విమర్శిస్తున్నారు.

సాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసిన వైఎస్‌..

2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కేవలం ఐదేళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం జిల్లాలో దాదాపు రూ.12వేల కోట్లు వెచ్చించారు. మొదటి దశలో భాగమైన అవుకు నుంచి గండికోటకు వరదకాలువ, గండికోట రిజర్వాయర్‌, టన్నెల్‌, వామికొండ, సర్వరాయసాగర్‌ పనులు సుమారు 85 శాతం పూర్తి చేశారు. అవుకు రిజర్వాయర్‌ కాంప్లెక్స్‌ సామర్థ్యాన్ని 4.8 టీఎంసీలకు పెంపు, గోరకల్లు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేశారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు విస్తరింపజేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపులో తెలంగాణ ప్రాంతం తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌, కోస్తా ప్రాంతం టీడీపీ నాయకులు సంయుక్తంగా జతకట్టి ఆరోపణలు గుప్పించారు. జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణపు పనులు దృష్టిలో ఉంచుకొని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించి, ఆరోపణలు గుప్పించిన నాయకుల అందరి నోర్లు మూయించి, ఒప్పించి, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ విస్తరణ సామర్థ్యం పెంచారని చరిత్రకారులు వివరిస్తున్నారు. జీఎన్‌ఎస్‌ఎస్‌ పథకంలో తొలుత గండికోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం లేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పులివెందుల నియోజకవర్గానికి తాగు, సాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ పథకానికి రూపకల్పన చేశారు. పైడిపాలెం వద్ద 6 టీఎంసీల సామర్థ్యంతో రూ.727 కోట్లు అంచనా వ్యయంతో పైడిపాళెం రిజర్వాయర్‌ ఏర్పాటు చేశారు. తద్వారా తొండూరు, సింహాద్రిపురం, కొండాపురం మండలాల్లోని చెరువులను నింపి 47,500 ఎకరాలకు కొత్తగా సాగునీరుతో పాటు, పీబీసీ కింద 41,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణతో పలు గ్రామాలకు తాగునీరు అందించాలనే సంకల్పం పుచ్చుకున్నారు.

వైఎస్‌ కుటుంబం కృషి ఫలితమే..

తుంగభద్ర హైలెవెల్‌ కెనాల్‌లో అంతర్భాగంగా గతంలో పులివెందుల బ్రాంచ్‌కెనాల్‌ నిర్మించారు. టీబీ డ్యాంలో పూడిక పేరుకుపోవడం, ఎగువప్రాంతాల నీటి అక్రమ వినియోగం వంటి కారణాల వల్ల పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌కు ఏనాడు పూర్తి సామర్థ్యంతో సాగునీరు అందలేదు. రైతులు అనేక ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆయకట్టు స్థిరీకరణ కోసం చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించారు. అయినా ఆశించిన ఫలితం కన్పించలేదు. ఈ నేపథ్యంలో సీబీఆర్‌కు గండికోట నుంచి 8.3 టీఎంసీల నీటిని 5 లిఫ్ట్‌ల ద్వారా తీసుకెళ్లే బృహత్తర పథకానికి కూడా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. రూ.1343 కోట్లు అంచనా వ్యయంతో చేపట్టగా, అందులో రూ.1090కోట్లు దివంగత సీఎం వైఎస్సార్‌ ఖర్చు చేశారు. నాటి కృషి ఫలితమే నేడు అంబకపల్లెకు కృష్ణా జలాలు వచ్చి చేరాయి. పాడా నిధుల ద్వారా అంబకపల్లె గంగమ్మ కుంటకు రూ.1.4 కోట్లతో 14 ఎకరాల భూసేకరణ చేపట్టి కొత్త చెరువును నిర్మించారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఎంపీ నిధులతో రూ.2.50 కోట్లు వెచ్చించి హిరోజ్‌పురం గ్రామం వద్ద భారీ సంప్‌ను ఏర్పాటు చేసి 4.5 కి.మీ మేర అంబకపల్లె చెరువుకు పైపులైన్‌ ఏర్పాటు చేశారు. ఫలితంగా అంబకపల్లె చెరువుకు కృష్ణా నీరు వచ్చి చేరింది. మంగళవారం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంబకపల్లె చెరువు వద్ద జలహారతి ఇవ్వనున్నారు.

సాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసిన దివంగత సీఎం వైఎస్సార్‌

మెట్ట ప్రాంతాల్లో కృష్ణా జలాలు పారిస్తే నా జన్మ ధన్యమని నాడే స్పష్టీకరణ

ప్రచార ఆర్భాటాలకే పరిమితమైన టీడీపీ ప్రభుత్వం

అంబకపల్లె చెరువుకు చేరిన కృష్ణమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement