
గోడ కూలి విద్యార్థికి తీవ్ర గాయాలు
తంబళ్లపల్లె : మండలంలోని గోపిదిన్నె ఉన్నత పాఠశాలలో బాత్‌రూము గోడకూలి ఓ విద్యార్థికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం జరిగింది. కొటాల పంచాయతీ ఎలపవారికోటకు చెందిన గంగప్ప కుమారుడు భరత్ గోపిదిన్నె ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ పాఠశాలలో 181 మంది విద్యార్థులు ఉన్నారు. విరామ సమయంలో బాత్‌రూము వెళ్లాడు. అక్కడ నూతననంగా నిర్మించిన బాత్‌రూములు ఉన్నా కొందరు విద్యార్థులు పాత బాత్‌రూములోకే వెళ్లారు. ఈ క్రమంలో గోడ కూలడంతో ఆ విద్యార్థి కాలిపై పడింది. కుడికాలు తొడపై పడటంతో కాలు విరిగింది. సమాచారం అందుకున్న 108 పైలెట్ దేవేంద్ర, ఈఎంటీ సుబ్రమణ్యం సంఘటన స్థలానికి వెళ్లి విద్యార్థిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎంఈఓ త్యాగరాజు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థి పరిస్థితి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి బర్డ్ ఆస్పత్రికి తరలించినట్లు ఎంఈఓ తెలిపారు.
భర్త ఇంటి ముందు ధర్నా
సంబేపల్లె : తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు కళ్యాణి అనే యువతి తన తల్లిదండ్రులతో కలసి ధర్నాకు దిగిన సంఘటన సోమవారం సంబేపల్లె మండలంలో జరిగింది సంబేపల్లె మండలం నాగిరెడ్డిగారిపల్లె గ్రామం అన్నప్పగారిపల్లెకు చెందిన కళ్యాణికి ఏడాది క్రితం మండలంలోని శెట్టిపల్లె గ్రామం పాపన్నగారిపల్లెకు చెందిన యాదగిరినాయుడుతో వివాహం చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు రామాంజులు, అరుణమ్మ తెలిపారు. కొన్ని నెలల క్రితం అధిక కట్నం తేవాలంటూ తమ కుమార్తెను వేధించి పుట్టింటికి పంపారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కాపురానికి రాలేదని తమకు నోటీసులు పంపారని కళ్యాణి వాపోయింది.

గోడ కూలి విద్యార్థికి తీవ్ర గాయాలు

గోడ కూలి విద్యార్థికి తీవ్ర గాయాలు