పింఛను సొమ్ముతో ఉడాయించిన ఉద్యోగి
కురబలకోట : మండలంలో లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేయకుండా నగదుతో జూనియర్ లైన్‌మన్ పారిపోయాడు. అంగళ్లుకు చెందిన జె.వెంకటేష్ (28) తెట్టు సచివాలయంలో గ్రేడ్–2 జూనియర్ లైన్‌మన్‌గా ఆరేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. తెట్టు దళితవాడలో పింఛన్ల పంపిణీ బాధ్యతను ఆయనకు అప్పగించారు. మొత్తం 111 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రూ.4,69,500లను వెంకటేష్‌కు అధికారులు ఇచ్చారు. సోమవారం ఉదయం పింఛన్లు పంపిణీ చేసేందుకు వెంకటేష్ రాకపోవడంతో కురబలకోట ఎంపీడీఓ గంగయ్యకు లబ్ధిదారులు సమాచారం ఇచ్చారు. ఆయన విచారణ చేయగా, పింఛన్ సొమ్ముతో వెంకటేష్ పరారైనట్లు తేలింది. అతని ఫోన్ కూడా స్విచ్చాఫ్ అని వస్తోంది. వెంకటేష్ రెండు రోజులుగా ఇంటికి రాలేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటేష్‌పై తెట్టు సచివాలయ కార్యదర్శి ఎన్.రామప్ప ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేష్‌ను సస్పెండ్ చేసినట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. కాగా, వెంకటేష్ గతంలోనూ ఒకసారి పింఛను సొమ్ము స్వాహా చేసేందుకు ప్రయత్నించినట్లు సిబ్బంది చెబుతున్నారు.


