
చేనేతలను విస్మరించిన కూటమి ప్రభుత్వం
ప్రొద్దుటూరు : రాష్ట్రంలో చేనేతలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్‌సీపీ పద్మశాలీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి తెలిపారు. విలేకరులతో బుధవారం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో లక్ష కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. 2014లో చేనేతలకు చంద్రబాబు ఇచ్చిన 25 హామీలు బుట్టదాఖలు చేశారని విమర్శించారు. 2024 మేనిఫెస్టోలో చేనేతలకు ఉచిత విద్యుత్, జీఎస్టీ ఫ్రీ హామీలిచ్చినా వాటిని అమలు చేయలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన అన్ని సంక్షేమ పథకాలను తాము ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఏడాదిన్నర గడచినా ఇవ్వలేదని విమర్శించారు. ఆప్కోను నిర్వీర్యం చేసి, చేనేత వ్యవస్థను అధఃపాతాళానికి తొక్కారని, వారంతా మళ్లీ ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో జగనన్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లు రూ.1,20,000లు వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారన్నారు. నేతన్న నేస్తం పథకం ద్వారా రూ.983 కోట్లు ఆర్థిక సాయం అందించారని, కరోనా కష్ట కాలంలోనూ ఈ మొత్తం అందించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఆప్కో వస్త్రాలను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థల ద్వారా పరిచయం చేసి చేనేతలను అగ్రగామిగా నిలిపారని తెలిపారు. వెంకటగిరి, మాధవరం, ధర్మవరం, మంగళగిరి, పెడన వంటి ప్రాంతాల్లో చేనేతలకు రెండు సెంట్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయకుండా.. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ పద్మశాలీ విభాగం
రాష్ట్ర అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి