హంద్రీ–నీవాలో అక్రమ ప్రమోషన్లు! | - | Sakshi
Sakshi News home page

హంద్రీ–నీవాలో అక్రమ ప్రమోషన్లు!

Aug 7 2025 7:24 AM | Updated on Aug 7 2025 7:40 AM

హంద్ర

హంద్రీ–నీవాలో అక్రమ ప్రమోషన్లు!

మదనపల్లె: హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండో దశ మదనపల్లె సర్కిల్‌–3 పరిధిలో జరిగిన అక్రమ ఉద్యోగ నియామకాలు, అక్రమ పదోన్నతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై జలవనరులశాఖ ఈఎన్‌సీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన వారిపై నివేదిక పంపాలని మదనపల్లె ఎస్‌ఈకి రెండు మెమోలు జారీ చేశారు. ఏపీఈఎస్‌ఎస్‌ నిబంధనల షెడ్యూల్‌ ప్రకారం టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ నియామకానికి అవసరమైన అర్హత కోసం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ నిర్వహించే ట్రేడ్‌ టెస్ట్‌ (డ్రాఫ్ట్‌స్‌ మ్యాన్‌) సివిల్‌ లేదా మెకానికల్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. నియామకాలు, బదిలీలు, పదోన్నతులను పరిగణలోకి తీసుకునేటప్పుడు సర్వీసు నియామకాల జీవో, ప్రభుత్వ సూచన లను పాటించాలని స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. అయితే ప్రాజెక్టు ఉన్నతాధికారులు ఈ నిబంధనలు, జీవోలను తుంగలో తొక్కారు. ఇవేమి తమకు పట్టవని పక్కన పడేశారు. చేయాల్సింది చేసేశాక ఇప్పుడు మెమోలు జారీ అవుతున్నా వాటిని డొంట్‌ కేర్‌ అంటున్నారు.

అక్రమ ప్రమోషన్ల వివరాల్లోకి వెళితే..

మదనపల్లె ఎస్‌ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి డిప్లొమా (ఈసీఈ)తో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. 2013 మార్చిన ఏడున ఆమెకు టెక్నికల్‌ అసిస్టెంట్‌ నుంచి జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌గా పదోన్నతి కల్పించారు. తర్వాత 2022 జూలై ఒకటిన జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ నుంచి టెక్నికల్‌ ఆఫీసర్‌గా మరోసారి పదోన్నతి పొందారు. పదోన్నతులు పొందిన తర్వాత దీనికి అవసరమైన అర్హత కలిగిన విద్యను దూర విద్య ద్వారా అభ్యసించేందుకు అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు నివేదించడంతో అక్రమ పదోన్నతుల వ్యవహారం పసిగట్టారు. దీంతో గతంలోనే ఎస్‌ఈలకు సర్కులర్‌ మెమోలను ఈఎన్‌సీ అధికారులు జారీ చేశారు. అక్రమ నియామకాలపై గతంలో మెమోలు ఇచ్చినా ఎందుకు మౌనంగా ఉండి ఇప్పటిదాకా కొనసాగిస్తున్నారని ఈ ఏడాది ఏప్రిల్‌ 24, జూలై 21న జారీ చేసిన మెమోల్లో ఎస్‌ఈని ఈఎన్‌సీ ప్రశ్నించారు. 14 ఏళ్ల తర్వాత ఎస్‌ఈ ఆ మహిళా ఉద్యోగి ఇప్పుడు డ్రాఫ్ట్‌స్‌మ్యాన్‌ ఐటీఐ విద్య అభ్యసించేందుకు అనుమతి ప్రతిపాదనలను..అక్రమ పదోన్నతులపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా పంపడంపై విస్మయం వ్యక్తం చేసిన ఈఎన్‌సీ జూలై 21న జారీ చేసిన మెమోలో మహిళ ఉద్యోగికి అక్రమ పదోన్నతులు కల్పించిన అధికారుల పేర్లతో వివరాలు పంపాలని ఆదేశించారు.

మరో ముగ్గురికి పదోన్నతులు

మహిళా ఉద్యోగికి కట్టబెట్టిన పదోన్నతులతో సరిపెట్టని ఉన్నతాధికారులు సర్కిల్‌ పరిధిలో పని చేస్తున్న మరో ముగ్గురు ఉద్యోగులకు ఇదే విధంగా అక్రమ పదోన్నతులు కల్పించారు. మదనపల్లె సర్కిల్‌ పరిధిలోని కుప్పం డివిజన్‌లో పని చేస్తున్న బ్లూ ప్రింటర్‌ ఆపరేటర్లు వై.చెన్నయ్య, కే.అబ్బిరెడ్డెయ్య, కదిరి డివిజన్‌లో పని చేస్తున్న పి.ఖాదర్‌బాషాల విద్యార్హత ప్రకారం పదోన్నతులు కల్పించాలి. అయితే అధికారులు ఇవేమి పట్టించుకోలేదు. వీరు పదోన్నతులు పొందాలంటే..నిబంధనల ప్రకారం ట్రేడ్‌ టెస్ట్‌ (డ్రాఫ్ట్‌స్‌మ్యాన్‌) సివిల్‌ లేదా మెకానికల్‌ కోర్సులో అర్హత సాధించి ఉండాలి. అయితే దీన్ని పట్టించుకోని అధికారులు ముగ్గురికి టెక్నికల్‌ అిసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతులను పసిగట్టిన ఈఎన్‌సీ మదనపల్లె ఎస్‌ఈకి జూలై 8న మెమో జారీ చేశారు. ఈ ముగ్గురి పదోన్నతులపై ఇంతవరకు చర్యలులేవు. వీరికి పదోన్నతులు ఎలా ఇచ్చారు, దీనికి బాధ్యులైన అధికారులు ఎవరు, వారి వివరాలు, సమ్రగ నివేదిక పంపాలంటూ మెమోలో కోరారు.

ఏం జరుగుతోంది?

బాధ్యులైన వారిపై నివేదిక ఇవ్వాలనిమెమోలిచ్చినా పట్టించుకోని అధికారులు

అర్హత లేకున్నా టెక్నికల్‌ అసిస్టెంట్లుగాఎలా ఇచ్చారని ఈఎన్‌సీ ఆగ్రహం

హంద్రీ–నీవా ప్రాజెక్టు కార్యాలయ పరిధిలో అక్రమ పదోన్నతుల వ్యవహరం వెలుగులోకి రావడంతో అసలు కార్యాలయంలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. మదనపల్లె సర్కిల్‌–3 కార్యాలయం పరిధిలో సత్యసాయిజిల్లా ధర్మవరంలో డివిజన్‌–10, కదిరిలో డివిజన్‌–9, 10, కర్నూలుజిల్లా ఎమ్మిగనూరులో గురురాఘవేంద్ర ప్రాజెక్టు–2, కుప్పం డివిజన్‌–12లతోపాటు సర్కిల్‌ కార్యాలయం నడుస్తున్నాయి. దీనితో ఎక్కడెక్కడో ఉన్న కార్యాలయాల్లో ఇంకా ఇలాంటి అక్రమ ప్రమోషన్లు, బదిలీ జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చర్యలు చేపట్టాం

ఈఎన్‌సీ ఇచ్చిన మెమోలపై అక్రమ పదోన్నతుల వ్యవహరంపై చర్యలు మొదలు పెట్టినట్టు ఎస్‌ఈ విఠల్‌ ప్రసాద్‌ సాక్షికి చెప్పారు. కోరిన మేరకు ఈఎన్‌సీకి నివేదించడంతో పాటు, తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టామని చెప్పారు.

హంద్రీ–నీవాలో అక్రమ ప్రమోషన్లు! 1
1/1

హంద్రీ–నీవాలో అక్రమ ప్రమోషన్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement