
ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నికల కోలాహలం!
సాక్షి రాయచోటి: ఆధ్యాత్మిక క్షేత్రం..భక్తులతో అలరాలే ఏకశిలానగరంలో రాజకీయ కోలాహలం కనిపిస్తోంది. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి గెలుపు లక్ష్యంగా పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎక్కడికక్కడ చర్చలు...గెలుపునకు అవసరమైన వ్యూహాలు...ప్రత్యర్థి వర్గాల ద్వారా ఓట్లు రాబట్టేందుకు అవసరమైన ప్రణాళికలతో సాగుతున్నారు.నామినేషన్లతో పాటు పరిశీలన, ఉపసంహరణ ముగియడంతో అభ్యర్థులంతా ప్రచారంపై దృష్టి సారించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. పార్టీలోని పలువురు కీలక నేతలంతా వచ్చి ప్రచారంలో పాల్గొంటూ అభ్యర్థి సుబ్బారెడ్డికి మద్దతుగా కదం తొక్కుతున్నారు.
● వైఎస్సార్ కడపజిల్లాలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా బుధవారం రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్‌కుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీసీఎం అంజద్‌బాషా, వైఎస్సార్ సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కడప నగర మేయర్, అన్నమయ్య జిల్లా పార్లమెంట్ పరిశీలకులు సురేష్‌బాబు, కడప పార్లమెంట్ పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతోపాటు కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వరి, గిడ్డంగుల సంస్థ మాజీ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం నరవకాటిపల్లెలో ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా ఎంపీ మేడా రఘునాథరెడ్డి, నందలూరు ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గొల్లపల్లి, దర్జిపల్లి గ్రామాల్లో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితోపాటు బద్వేలు నియోజకవర్గ నాయకులు ప్రచారంలో పాల్గొని వైఎస్సార్ సీపీ అభ్యర్థిని దీవించాలని కోరారు. పార్టీ శ్రేణులతోపాటు నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేలుస్తూ డప్పు వాయిద్యాల నడుమ ప్రచారం కొనసాగించారు.
పులివెందుల, ఒంటిమిట్టల్లో గెలుపు తథ్యం
ఒంటిమిట్టతోపాటు పులివెందుల జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలుపు తథ్యమని, దీనిని ఎవరూ ఆపలేరని పార్టీ కీలక నేతలు ఉద్ఘాటించారు.బుధవారం ప్రచారంలో భాగంగా పాల్గొన్న అనంతరం వారు మాట్లాడారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పులివెందులలో ఎన్ని అరాచకాలు సృష్టించినా ఏమి చేయలేరని...పోలీసులు కూడా పక్షపాత ధోరణి విడనాడాలని వారు హితవు పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలవుతున్నా ప్రజలకు ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయిందని, ప్రజలు ఎటువంటి పథకాలూ అందుకోవడం లేదని విమర్శించారు. ప్రజలు ఈ ఉపఎన్నికలో తమ ఓటుతో ప్రభుత్వం పాలనపై గట్టి సమాధానం చెబుతారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి మద్దతు ఇవ్వాలని నాయకులు కోరారు.
● ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయంలో బుధవారం పలువురు వైస్సార్ సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రచార పర్వంలో భాగంగా పార్టీ నేతలు తొలుత స్వామి వారిని దర్శించకున్నారు. పార్టీ నేతలకు అర్చకులు సాదర స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
పులివెందులలో దాడి హేయం: ఇరగంరెడ్డి
ఒంటిమిట్ట: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని నల్లగొండువారిపల్లెలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై జరిగిన దాడి హేయమైన చర్య అని ఒంటిమిట్ట వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఉప ఎన్నిక ప్రచారం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. దాని పర్యవసానమే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడులు జరగడానికి కారణమన్నారు. టీడీపీ గూండాలు దాడి చేసినా రక్తం చిందించి వైఎస్సార్‌సీపీని గెలిపించుకుంటామన్నారు.
ఒంటిమిట్టలో వైఎస్సార్‌సీపీ
కీలక నేతల ఇంటింటి ప్రచారం

ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నికల కోలాహలం!