
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
పీలేరురూరల్ : తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పీలేరు మాజీ సర్పంచ్ ఎ.ఎస్. హుమయూన్ (65), ఆయన సోదరుడు షాజహాన్ (55) మృతి చెందగా, ఆయన కుమారుడు, వార్డు మెంబరు హబీబ్‌బాషా పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం తిలక్ వీధికి చెందిన మాజీ సర్పంచ్ ఎ.ఎస్. హుమయూన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చైన్నెలో చికిత్స పొందడానికి సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంటి నుంచి కారులో బయలుదేరారు. అయితే ఉదయం 6.30 గంటల సమయంలో తిరుత్తణి వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో హుమయూన్, ఆయన సోదరుడు షాజహాన్ అక్కడి కక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హబీబ్‌బాషాను స్థానికుల సాయంతో తిరుత్తణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చైన్నె అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మృతి చెందిన హుమయూన్ రెండు పర్యాయాలు పీలేరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఫోన్ ద్వారా హుమయూన్ సోదరులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
మృత్యువులోనూ వీడని బంధం..
మాజీ సర్పంచ్ హుమయూన్‌కు తోడు నీడగా ఉంటున్న సోదరుడు షాజహాన్ మృత్యువు లోనూ వీడని బంధంగా మృతి చెందడంతో పలువురిని కలచివేసింది. ఒకే కుటుంబంలో అన్నాదమ్ములు ఇద్దరు మృతి చెందడం, మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో పీలేరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పీలేరు మాజీ సర్పంచ్ హుమయూన్, ఆయన సోదరుడు మృతి
కుమారుడి పరిస్థితి విషమం
పీలేరులో అలుముకున్న విషాద ఛాయలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం