
నల్ల తుమ్మచెట్ల అక్రమార్కులపై చర్యలకు జేసీ ఆదేశం
కలికిరి(వాల్మీకిపురం) : వాల్మీకిపురం మండల పరిధిలోని మంచూరు గ్రామ పంచాయతీలో వున్న తిమ్మిరెడ్డికుంట, కొత్తకుంటలో ఎలాంటి అనుమతులు లేకుండా నల్ల తుమ్మ చెట్లను ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ కె.జ్యోతి భర్త పి.సురేష్ విక్రయించి సొమ్ము చేసుకోవడంపై సోమవారం సాక్షిలో ‘నల్ల తుమ్మ చెట్లు అక్రమ రవాణా’ కథనం ప్రచురితమైంది. అలాగే మంచూరు గ్రామస్తులు శంకర్‌రెడ్డి తదితరులు సాక్షిలో ప్రచురితమైన కథనంతో సోమవారం పీజీఆర్‌ఎస్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన జేసీ ఆదర్శ రాజేంద్రన్ నల్లతుమ్మ చెట్లు అక్రమ రవాణాపై సమగ్ర విచారణ జరిపి అక్రమదారులపై కేసు నమోదు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఈ మేరకు డీపీఒ ఆదేశాల మేరకు మదనపల్లి డీఎల్‌పీఓ నాగరాజ సోమవారం సాయంత్రం మంచూరు పంచాయతీ పరిధిలోని తిమ్మిరెడ్డికుంట, కొత్తకుంటలను పరిశీలించారు. రెండు కుంటలలో కలిపి సుమారు 60 చెట్లకు పైగా కోసినట్లు గుర్తించామన్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి తుమ్మచెట్ల వేలానికి గానీ, తరలింపునకు గానీ, కటింగ్‌కు గానీ ఎలాంటి అనుమతులు లేవని, అటవీశాఖ నుంచి మాత్రం కటింగ్ ఆర్డర్ ఉన్నట్లు తమ విచారణలో తేలిందని డీఎల్‌పీఒ వివరించారు. అలాగే గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించామన్నారు. గ్రామస్తుల వివరాలు, పంచాయతీ కార్యదర్శి వివరణ అనంతరం, విచారణ నివేదికను డీపీఓకు పంపనున్నట్లు డీఎల్‌పీఒ పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి సుమతి, మంచూరు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ డీఎల్‌పీఓ వెంట పాల్గొన్నారు.

నల్ల తుమ్మచెట్ల అక్రమార్కులపై చర్యలకు జేసీ ఆదేశం