
అది అన్నదాత దుఃఖీభవ పథకం
రాయచోటి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు అందించింది అన్నదాత సుఖీభవ కాదని, అన్నదాత దుఃఖీభవ పథకమని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు వై.ఆరంరెడ్డి, రాష్ట్ర బూత్ వింగ్ జనరల్ సెక్రటరీ రహిమాన్ ఖాన్‌లు దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ రాష్ట విభాగం పిలుపు మేరకు సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా రైతు సంఘం నాయకులు, సభ్యులు, రైతులు కూటమి ప్రభుత్వ నిరంకుశత్వ పోకడలపై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా పథకానికి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో అన్నదాత సుఖీభవ అని నమ్మించి రైతులను నట్టేట ముంచిందన్నారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ. 2 వేలు జమ చేశారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ విడుదల చేయలేదన్నారు. పీఎం కిసాన్ కూడా కొంతమంది రైతులకు మాత్రమే వేసి మిగిలిన రైతులకు మొండి చేయి చూపారన్నారు. రైతులంటే చంద్రబాబుకు మొదటి నుంచి చిన్నచూపే అని ఆరోపించారు. గతంలో మహానేత వైఎస్సార్ ఉచిత విద్యుత్ ప్రకటిస్తే విద్యుత్ తీగలపై రైతులు బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు ఎద్దేవా చేశారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు విలయతాండవం చేస్తుందన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 57 లక్షల మంది రైతులకు రైతు భరోసా ద్వారా సంక్షేమం అందిస్తే కూటమి ప్రభుత్వంలో 12 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ అందకుండా చేశారంటూ మండిపడ్డారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.