
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కొరియర్ వాహనం బోల్తా
సిద్దవటం : మండలంలోని సిద్దవటం గ్రామ సమీపంలో అన్నపూర్ణ భిక్షేశ్వర స్వామి ఆలయం వద్ద సోమవారం కొరియర్ పార్సిల్ వాహనం రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వాహనం వంకలో బోల్తా పడింది. కడప నుంచి బద్వేలుకు సోమవారం కొరియర్ పార్సిల్‌ను తీసుకు వెళుతున్న వాహనం నేకనాపురం రహదారి దాటుకొని శ్రీ అన్నపూర్ణ భిక్షేశ్వర స్వామి ఆలయం వద్దకు రాగానే విద్యుత్ స్తంభాన్ని వాహనం ఢీకొనడంతో స్తంభం విరిగి పోయింది, వాహనం వంకలో బోల్తాపడింది. దీంతో సిద్దవటంలో 4 గంటల పాటు విద్యుత్‌కు అంతరాయం కలిగింది. వాహనంలో ఉన్న కిషోర్, చాంద్‌బాషా అనే ఇద్దరు వ్యక్తులకు గాయాలు కావడంతో 108 వాహనంలో వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై సిద్దవటం ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.