
సత్వరమే సమస్యల పరిష్కారం
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు బాధ్యతగా పనిచేసి వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. కాబట్టి అధికారులు ప్రాధాన్యతగా ఫిర్యాదులను నూరు శాతం పరిష్కరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బియాండ్ ఎస్‌ఎల్‌ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
12న జాతీయ నులిపురుగుల
నిర్మూలన కార్యక్రమం
రాయచోటి జగదాంబసెంటర్ : వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జాతీయ నులిపురుగల నిర్మూలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు , పిల్లలు మరియు కిశోర బాలలకు (ఒక సంవత్సరం నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు) ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నుట్ల జిల్లా కలెక్టర్ శ్రీధర్‌చామకూరి తెలిపారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించి గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మీనరసయ్య, వైద్య ఆరోగ్య సిబ్బంది శివప్రతాప్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్