
మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ: తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండకు సోమవారం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్టు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఉదయం 5.30 గంటలకు, 6.30 గంటలకు మదనపల్లె డిపో నుంచి బయలుదేరి మల్లయ్యకొండకు చేరుతుందన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి మల్లయ్యకొండకు సాయంత్రం వరకు షటిల్ సర్వీసు నడుస్తుందన్నారు. భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 4వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని ఆయన పేర్కొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
రాయచోటి జగదాంబసెంటర్: జిల్లాలోని మదనపల్లె మండలం వలసపల్లెలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం.గీత ఒక ప్రకటనలో తెలిపారు. 2024 –2025 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. www.navodaya.gov.in అనే వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన అనంతరం ఆఫీస్ పనివేళల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని ప్రిన్సిపాల్ తెలియజేశారు.
వెలిగల్లు కుడికాలువకు
నీరు విడుదల
గాలివీడు: రైతుల సంక్షేమమే ధ్యేయమని రాష్ట్ర యువజన,రవాణా,క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం తన సోదరుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులతో కలసి మండలంలోని వెలిగల్లు జలాశయం కుడికాలువ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతుల సౌకర్యార్థం కుడికాలువ ద్వారా నీటిని 0.5 టీఎంసీలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వెలిగల్లు జలాశయంలో ప్రస్తుతం 2.681 టీఎంసీల నీరు నిల్వ ఉందని, అందులో లైవ్ స్టోరేజ్ 1.47 టీఎంసీలు కాగా, తాగునీటి కోసం 0.40 టీఎంసీలు కేటాయించినట్లు తెలిపారు.
చెస్‌లో క్రీడాకారుల ప్రతిభ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: బెంగుళూరులో జరిగిన 3వ చెస్ ప్యూషన్ నేషనల్ లెవల్ చెస్ టోర్నమెంట్‌లో జిల్లాకు చెందిన చెస్ క్రీడాకారులు ప్రతిభ చాటారని చెస్ కోచ్ అనీష్ దర్బారీ పేర్కొన్నారు. బెంగుళూరులోని గోల్డోన్ బీ గ్లోబల్ స్కూల్‌లో జరిగిన 3వ చెస్ ప్యూషన్ నేషనల్ లెవల్ చెస్ టోర్నమెంట్‌లో అండర్–8లో బాలికల విభాగంలోజిల్లాకు చెందిన వినమత్ర 5 స్థానంలో నిలిచి ట్రోపీ గెలుచుకుందన్నారు. అండర్ –10లో బాలికల విభాగంలో ప్రొద్దుటూరు చెందిన ధనిత 8వ స్థానంలో నిలిచి మెడల్ అందుకుందన్నారు.మొత్తం 7 రౌండ్‌లలో జిల్లా చెస్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచినట్లు కోచ్ పేర్కొన్నారు. కాగా కాగా సీనియర్స్ విభాగంలో చెస్ కోచ్ అనీష్ దర్బారీ ప్రథమ స్థానంలో నిలిచి నగదు బహుమతి అందుకోవడం విశేషం.
పోలీసుల గస్తీ
సిద్దవటం: సిద్దవటం పెన్నానదిపై ఉన్న లోలెవల్ కాజ్‌వే పై పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐ సుబ్బరామచంద్ర మాట్లాడుతూ సిద్దవటం వద్ద పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆదివారం పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారన్నారు. ఒంటిమిట్ట సీఐ బాబు, సిద్దవటం ఎస్‌ఐ సూచనల మేరకు కాజ్‌వేపైన పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రమాదాలు జరగకుండా మందస్తు చర్యగా అక్కడికి పర్యాటకులను రానివ్వలేదన్నారు. ఉదయం చేపలు పట్టే వారు వస్తే వారిని కూడా పంపిచేశామన్నారు.కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి నదిలోకి దిగుతారనే ఉద్దేశంతో కాజ్‌వే వద్ద ఉన్నామని ఏఎస్‌ఐ తెలిపారు.