
ప్రభుత్వం సహకరిస్తేపతకాలు సాధిస్తాం
శాప్ డైరెక్టర్ రమణరావు
కడప రూరల్: ప్రభుత్వం సహకరిస్తే పతకాలు సాధిస్తామని ద్రోణాచార్య అవార్డు గ్రహీత, రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ డైరెక్టర్ (శాప్) ఆరికపూడి రమణరావు అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. శాప్ చైర్మన్ ఆదేశాల మేరకు కడప క్రీడా పాఠశాలను తనిఖీ చేశామన్నారు. ఈ సందర్భంగా క్రీడా మైదానాలు, క్రీడాకారుల మౌలిక సదుపాయాలను పరిశీలించామన్నారు. అలాగే క్రీడాకారులతో మాట్లాడామని తెలిపారు. క్రీడల్లో పతకాలు సాధించాలంటే నిధుల అవసరం ఎంతో ఉంటుందన్నారు. క్రీడలకు బడ్జెట్‌లో అధిక శాతం నిధులు కేటాయించినపుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించవచ్చన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనందిస్తే పతకాలను సాధిస్తామని తెలిపారు. మరో డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడు వేల మంది ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారని, మరో రెండు వేల మంది ఫిజికల్ డైరెక్టర్లు రానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్లు తమ సమస్యలను విన్నవించి పరిష్కరించాలని కోరారు. జిల్లా స్కూలు గేమ్స్ సెక్రటరీ అరుణకుమారి, రాష్ట్ర పీఈటీ అసోసియేషన్ సెక్రటరీ ప్రవీణ్ కిరణ్, వ్యాయామ ఉపాద్యాయులు సాజిద్ తదితరులు పాల్గొన్నారు.