
ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్
చిన్నమండెం: ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. చిన్నమండెం మండల కేంద్రంలోని 2వ సచివాలయం వద్ద అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రతి రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన ద్వారా రూ.6 వేలు కలిపి సంవత్సరానికి రూ.20 వేలు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగిస్తూ ఇది తక్కువ ఖర్చుతో కూడిన స్థిరమైన వ్యవసాయ విధానమని, ఇది భూమి ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలుగా ఉంటుందని వివరించారు. మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి, జేడీఏ శివనారాయణ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డీపీఎం) వెంకటమోహన్, డీసీఎంఎస్ చైర్మన్ జయప్రకాష్‌నారాయణ, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.