
తండ్రీ కొడుకుల గొడవలో చేనేత కార్మికుడికి గాయాలు
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో తండ్రీ కొడుకులు దారిలో గొడవపడుతూ ఇనుప వస్తువులు ఒకరిపై ఒకరు విసురుకుంటుండగా, అటుగా వెళుతున్న ఓ చేనేత కార్మికుడిపై పడటంతో తీవ్రంగా గాయపడి కాలు విరిగిన ఘటన శనివారం సాయంత్రం మదనపల్లె పట్టణంలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఇంతియాజ్ అహ్మద్(55) పదిరోజుల క్రితం బతుకుదెరువులో భాగంగా మదనపల్లెకు వచ్చాడు. నీరుగట్టువారిపల్లెలో మగ్గం కార్మికుడిగా పనిచేసుకుంటున్నాడు. శనివారం సాయంత్రం పనులు చేస్తూ విరామం కోసం మగ్గం గుంతలో నుంచి లేచి బజారులోకి వచ్చాడు. అదే సమయానికి పక్కింటికి చెందిన రామచంద్ర అతడి కుమారుడు లోకేష్ కుటుంబ సమస్యలతో గొడవపడుతూ ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లు, ఇనుపవస్తువులు విసురుకుంటున్నారు. రామచంద్ర విసిరిన ఇనుప వస్తువు వేగంగా వచ్చి ఇంతియాజ్ అహ్మద్ కాలుకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.