
ఇక ‘ఆపరేషన్ ట్రేస్’ !
రాయచోటి : జిల్లాలో తప్పిపోయిన బాల బాలికలను గుర్తించి వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ ట్రేస్ జిల్లాలో ప్రారంభమైందని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. శనివారం రాయచోటిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం నిర్వహణపై పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీవింగ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ రూపంలో అమలు చేయాలని సూచించారు. బాలికల అపహరణలు, తప్పిపోవడాలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేది నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతున్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 30 నుంచి 37 మిస్సింగ్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ కేసులలో ఐదు మంది చిన్నారులు కూడా కనిపించకుండా పోయినట్లు సమాచారం ఉందన్నారు. జిల్లాలోని పోలీసు యంత్రాంగం పూర్తి సమన్వయంతో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమంలో పాల్గొంటుందన్నారు. కుటుంబాల నుండి దూరమైన బాలికలను గుర్తించి వారికి అవసరమైన సహాయం అందించి తిరిగి వారి కుటుంబాల వద్దకు చేర్చడమే ఆపరేషన్ ట్రేస్ లక్ష్యమని ఎస్పీ అభిప్రాయపడ్డారు.
ఆపరేషన్ ట్రేస్..
ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమానికి సంబంధించి ఆగస్టు నెల 1, 2వ తేదిలలో డేటా కలెక్షన్ కోసం సబ్ డివిజన్ స్థాయిలో టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు నెలలో 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎన్జీఓలు, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న షెల్టర్స్ తనిఖీ చేస్తారన్నారు. సంబంధిత ఎఫ్‌ఐఆర్‌లను రీ వెరిఫికేషన్ చేయడం, అందులో భాగంగా టెక్నాలజీని ఉపయోగించడం మొదటి ప్రాధాన్యతగా చేపడతామన్నారు. ఫేస్ రికగ్నైజేషన్, డీఎన్‌ఏ టెస్టు, ఆధార్ ద్వారా వయస్సుకు సంబంధించిన సమాచారం సేకరిస్తామన్నారు. రెండో విచారణలో భాగంగా ఈనెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్‌లు, ప్రార్థనా స్థలాలు, రెడ్ లైట్ ఏరియాలలో ప్రత్యేక తనిఖీల ద్వారా తప్పిపోయిన బాలికలను గుర్తించే చర్యలు ఉంటాయన్నారు. శక్తి యాప్‌లో రిపోర్టు మిస్సింగ్ చిల్డ్రన్ అనే ఫీచర్ ద్వారా తప్పిపోయిన పిల్లల కోసం ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆపద సమయంలో సహాయం కోసం ఎస్‌ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులు తక్షణమే స్పందించి సహాయం చేస్తారని తెలిపారు. తప్పిపోయిన పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని 112 నెంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా లైదా చైల్డ్ హెల్ప్‌లైన్ నెంబరు. 1098కు, ఉమెన్ హెల్ప్‌లైన్ నెంబర. 181కు, శక్తి వాట్సప్ నెంబర్ 7993485111కు సమాచారం ఇవ్వడం ద్వారా సహాయం పొందగలరన్నారు.
డివిజన్ పరిధిలో....
జిల్లాలో ప్రతి సబ్ డివిజన్ పరిధిలో మహిళల రక్షణ కోసం శక్తి టీమ్‌లు పనిచేస్తున్నాయన్నారు. ఈ టీమ్‌లు బహిరంగ ప్రదేశాలలో ఈవ్ టీజింగ్ చేసే ఆకతాయిల భరతం పడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒన్ స్టాప్ సెంటర్‌లు బాధిత మహిళలకు, బాలికలకు అన్ని విధాలుగా సహాయం చేస్తాయని తెలిపారు. జిల్లాలోని ప్రతి స్కూల్‌లో క్లాస్ రూమ్ నుండి ఐదుగురు బాలికలను శక్తి వారియర్స్ గ్రూప్‌గా ఏర్పాటు చేసి వారికి శక్తి టీమ్ ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లు గురించి క్రిందిస్థాయి అధికారులు వివరించారన్నారు. అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి బాలికలకు తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమాలలో తప్పిపోయిన బాలికలకోసం పోలీసులతోపాటు, ఎన్‌జీఓలు, ప్రజా సంఘాలు పాల్గొని సహకారం అందించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి ప్రాధాన్యతగా ఆపరేషన్ ట్రేస్‌ను పోలీసు స్టేషన్ల ద్వారా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. బాలికలను అక్రమ రవాణా చేసే ముఠాల నుంచి రక్షించి వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు.
తప్పిపోయిన మహిళలు, బాలికల ఆచూకీ
కోసం పోలీసు శాఖ ప్రత్యేక కార్యక్రమం
జిల్లాలో 37కు పైగా మిస్సింగ్ కేసులు
వారంలోగా ఛేదించాలన్న జిల్లా ఎస్పీ
నాన్ బెయిలబుల్ నిందితులు అరెస్టు..
జిల్లాలో నాన్ బెయిలబుల్ వారెంట్లు కలిగి తప్పించుకు తిరుగుతున్న నిందితులపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులను అప్రమత్తం చేసి ప్రత్యేక డ్రైవ్ ద్వారా 150కిపైగా నాన్ బెయిలబుల్ వారెంటుదారులను అరెస్టు చేసి కోర్టులో లొంగిపోయే విధంగా చేశామన్నారు. ఇందులో పాలుపంచుకున్న పోలీసు అధికారులను ఎస్పీ అభినందించి ప్రోత్సహించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి పాల్గొన్నారు.