
రాయచోటిలో చెలరేగుతున్న గ్యాంగులు
రాయచోటి : రాయచోటిలో అల్లరి మూకల గ్యాంగుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా దాడులు, ప్రతి దాడులు, బైకుల ర్యాలీలు, స్టంట్‌లతో పట్టణ ప్రజలను, వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. విచ్చలవిడిగా గ్యాంగుల దాడులతో ఎక్కడ ఏమి జరుగుతుందోన్న భయం పట్టణ ప్రజల్లో నెలకొంది. విచ్చలవిడిగా రెచ్చిపోతున్న గ్యాంగులను అదుపుచేయడంలో రాయచోటీ పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిరోజూ రెండు, మూడు ప్రాంతాల్లో గ్యాంగుల దాడులతో గాయాలపాలైన మూగ రోదనలతో ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. దాడులలో గాయపడిన వారు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కినా గ్యాంగులకు రాజకీయ నాయకుల అండదండలు లభిస్తుండటంతో వారిపై కేసులు నమోదు చేసే సాహసాన్ని పోలీసులు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆర్టీసీ ఇంద్ర బస్సుపై దాడి.
రాయచోటి పట్టణంలోని నేతాజీ సర్కిల్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఇంద్ర ఆర్టీసీ బస్సుపై పట్టణంలోని ఒక గ్యాంగ్ రాళ్లతో దాడికి తెగబడింది. నేతాజీ సర్కిల్ నడిరోడ్డుపై బైకులు ఆపి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై గ్యాంగ్ నాయకులు వీరంగం సృష్టించారు. ఇదే సమయంలో కడప నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఇంద్ర ఏపీ04జెడ్0397 నెంబరుగల ఆర్టీసీ బస్సు 12 గంటల అనంతరం రాయచోటిలోని నేతాజీ సర్కిల్‌కు చేరుకుంది. రోడ్డుపై అడ్డంగా ఉన్న బైకులను తొలగించాలని డ్రైవర్ కోరినా పీకలతోతు మద్యం తాగిన గ్యాంగ్ సభ్యులు ఆర్టీసీ డ్రైవర్‌పై తిరగబడ్డారు. ఈ బస్సు వెనుకవైపు వచ్చిన బద్వేల్ ఆర్టీసీ బస్సును కూడా యువకులు అడ్డగించి అసభ్య పదజాలంతో డ్రైవర్‌ను దూషించారు. వారితో వాదనలను పెట్టుకోకుండా ఇరంద బస్సు డ్రైవర్ బస్సును చాకచక్యంగా ముందుకు నడిపి వెళ్తున్న సమయంలో గ్యాంగ్ సభ్యులు ఆ బస్సును వెంటపడి చిత్తూరు–మదనపల్లి క్రాస్ రోడ్డు సమీపంలోని శివాలయం వద్దకు చేరుకోగానే బండరాళ్లతో బస్సుపై దాడి చేశారు. రాళ్లదాడిలో ఇంద్ర బస్సు వెనుక అద్దాలు పగిలిపోయాయి. అయితే ఈ బస్సులో వెనుక భాగాన ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జరిగిన సంఘటనపై డ్రైవర్ జేసీ సుబ్బారావు రాయచోటి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు రాయచోటి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రేక్షక పాత్రలో పోలీసులు
అర్ధరాత్రి వేళ ఆర్టీసీ ఇంద్ర బస్సుపై దాడి.. పగిలిన అద్దాలు

రాయచోటిలో చెలరేగుతున్న గ్యాంగులు