
భర్త మద్యం మానలేదని ఆత్మహత్య
బి.కొత్తకోట : మద్యానికి బానిసైన భర్త..భార్య, బిడ్డలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం, ఎన్నిసార్లు వేడుకున్నా మద్యం మానకపోవడంతో ఆవేదనకు గురైన భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బి.కొత్తకోట మండలం పులుసుమానిపెంటలో జరిగింది. గతనెల 31న గురువారం రాత్రి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. మొటుకుపల్లె పంచాయతీ బద్దిపల్లెకు చెందిన ఎం.లక్ష్మిదేవి (35)కి, ఇదే పంచాయతీ పులుసుమానిపెంటకు చెందిన శివశంకర (35)తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి జగదీష్ (13), రజిత (11) సంతానం. శివశంకర్ మేసీ్త్ర పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పొషించుకునే వాడు. అయితే మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై భార్య లక్ష్మిదేవి, ఆమె తండ్రి వీరమల్లు పలుమార్లు మద్యం మానుకొని కుటుంబాన్ని చూసుకోవాలని శివశంకర్‌ను ప్రాధేయపడ్డారు. అయినప్పటికి శివశంకర్ పెడచెవినపెట్టాడు. భార్య ఈ విషయమై కుటుంబం ఇబ్బందుల్లో పడుతుందని, పిల్లల భవిష్యత్తు చూడాలని ప్రాధేయపడేది. ఎవరి మాట వినని భర్తను ఇక భరించలేనన్న నిర్ణయానికి వచ్చిన లక్ష్మిదేవి గురువారం రాత్రి ఇంటిలో విష ద్రావణం తాగింది. గమనించిన స్థానికులు భర్త, తండ్రికి విషయం తెలపడంతో వారు చికిత్స కోసం కర్ణాటకలోని రాయల్పాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తర లించాలని సూచించగా మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీ సుకొచ్చారు. అక్కడి నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. దీనిపై మృతురాలి తండ్రి వీరమల్లు ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ రామాంజులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోని తండ్రి కారణంగా ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.