
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తు లు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్ట వైఎస్సార్ కాలనీకి చెందిన నరసింహులు కుమారుడు మురళీ(50) శనివారం వ్యక్తిగత పనులపై స్వగ్రామమైన కలకడ మండలం గుడిబండకు వెళ్లి తిరిగి ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వస్తుండగా, కురబలకోట మండలం ముదివేడు సమీపంలోని అడవిలోపల్లె క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన బొలేరో ఢీకొంది. ప్రమాదంలో మురళీ తీవ్రంగా గాయపడగా, స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో వైద్యు లు చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితుడిని రెఫర్ చేశారు. అయితే బాధితుడి వెంట వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు రెఫర్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో సరైన చికిత్స అందించకుండానే వచ్చిన ప్రతి కేసు రెఫర్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థికి తీవ్ర గాయాలు..
ద్విచక్రవాహనం ఢీకొని విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం పుంగనూరు మండలంలో జరిగింది. భీమగానిపల్లెకు చెందిన విద్యార్థి రాంచరణ్ (16) స్కూల్ వదిలిన వెంటనే మధ్యాహ్న భోజనం కోసం మోదుగులపల్లె కట్ట వద్ద వెళుతుండగా, ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనం విద్యార్థిని ఢీకొంది. ప్రమాదంలో రాంచరణ్ తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. ఆయా ప్రమాద ఘటనలపై సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు