
ల్యాండ్రీ షాపులో అగ్ని ప్రమాదం
పీలేరు రూరల్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ల్యాండ్రీ షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. స్థానిక జెండామాను వద్ద శ్రీనివాసులు ల్యాండ్రీ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో షాపులో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే బట్టలు దగ్ధమయ్యాయి.
జూనియర్ లైన్‌మ్యాన్ అదృశ్యం
గాలివీడు : తూముకుంట గ్రామం ప్రకాష్ నగర్ కాలనీకి చెందిన మూడే బద్దె నాయక్ కుమారుడు, జూనియర్ లైన్‌మ్యాన్ రవి నాయక్(25) కనిపించకపోవడంపై కేసు నమోదు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన రవి నాయక్ ఇంటి నుంచి వెళ్లిపోయాడన్నారు. ఈయన కడప సీకే దిన్నె మండలంలో జూనియర్ లైన్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడన్నారు. మీటరు దారుల వద్ద కరెంటు బిల్లుల రూపంలో దాదాపు రూ.3 లక్షల వరకూ అప్పులు చేసి అవి చెల్లించలేక వెళ్లిపోయినట్లుగా తెలిపారు.
బైక్ అదుపు తప్పి
వ్యక్తికి గాయాలు
నిమ్మనపల్లె : బైక్ అదుపు తప్పి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం నిమ్మనపల్లెలో జరిగింది. నిమ్మనపల్లె దిగువ వీధికి చెందిన స్వర్ణ సింగ్ (40) వ్యక్తిగత పనులపై ముష్టూరు పంచాయతీ దిగువపల్లెకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. నిమ్మనపల్లెలోని అభయాంజనేయస్వామి ఆలయం వద్ద బైక్ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
భార్యపై కరెంట్ వైర్లతో దాడి
కడప అర్బన్ : కడప నగరం చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్‌లో సప్తగిరి అనే వ్యక్తి తన భార్యపై కరెంట్ వైర్లతో దాడి చేసిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాష్ నగర్ కు చెందిన సప్తగిరికి 5 సంవత్సరాల క్రితం వైష్ణవితో వివాహమైంది. భార్యను తరచు వేధించేవాడు. అయితే కరెంటు వైర్లతో గురువారం ఇష్టానుసారంగా చితక బాదడంతో తీవ్ర గాయాల పాలైంది. వైష్ణవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వ్యాపారి ఆత్మహత్య
పులివెందుల రూరల్ : మండలంలోని నల్లపురెడ్డిపల్లె సమీపంలో ఉన్న ఎర్రబల్లె తండాలో నివాసముంటున్న ఆంజనేయ నాయక్(42) అనే అరటి కాయల వ్యాపారస్తుడు గడ్డి నివారణ మందు సేవించి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంజనేయ నాయక్ అరటి కాయల వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పులివెందుల ప్రాంతంలోని అరటికాయలను ఢిల్లీ వ్యాపారస్తులకు ఎగుమతి చేసేవాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వ్యాపారస్తులు సుమారు లక్షలాది రూపాయల డబ్బులు పంపించకపోవడంతో ఆంజనేయ నాయక్ పులివెందుల ప్రాంతంలోని రైతులకు చెప్పుకోలేక గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

ల్యాండ్రీ షాపులో అగ్ని ప్రమాదం