
ఒకరి నగలు మరొకరికి అప్పగింత
రాజంపేట : ఒకరినగలు మరొకరికి ఇచ్చేసిన సంఘటన రాజంపేట మెయిన్‌రోడ్డులోని కెనరా బ్యాంక్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజంపేట పట్టణంలోని మన్నూరుకు చెందిన షేక్ నసీం జీవనోపాధి కోసం కువైట్‌లో ఉంటోంది. యేడాది క్రితం 50 గ్రాముల బంగారు నగలు కెనరాబ్యాంక్‌లో పెట్టి రుణం తీసుకున్నారు. కువైట్‌కు తనతోపాటు పాసుబుక్, రుణం రసీదు తీసుకెళ్లింది. మూడు రోజుల క్రితం స్వదేశం వచ్చింది. గోల్డ్‌లోన్ రెన్యూవల్ చేసుకుందామని బ్యాంక్‌కు వెళ్లింది. ఆమెకు కెనరా బ్యాంక్ సిబ్బంది షాక్ ఇచ్చారు. నగలు లేవని సమాచారం ఆమెను ఆందోళనకు గురి చేసింది. తాను నగలు తనఖా పెట్టి వెళితే తనకు తెలియకుండా ఎవరు తీసుకెళ్లారని బ్యాంక్ మేనేజర్‌ను నిలదీసింది. బాధితురాలి తల్లి, కూతురు నగలను విడిపించుకెళ్లినట్లు సమాచారం ఇచ్చారు. ఈ వ్యవహారంపై కెనరాబ్యాంక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని పట్టణ పోలీసులు బాధితురాలికి సలహా ఇచ్చారు.
బురఖా వేసుకొని మోసం చేశారు..
బ్యాంకులో షేక్ నసీం గోల్డ్‌లోన్‌కు సంబంధించి ఒకరి నగలు మరొకరికి ఇచ్చిన వ్యవహారంపై మేనేజర్ మౌనిస్ ‘సాక్షి’తో మాట్లాడుతూ బురఖా వేసుకొని నసీం తల్లి, కూతురు నగలను తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. గోల్డ్ రిలీజ్ ప్రాసెస్ నసీం చేసినట్లుగా జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై పోలీసులు కూడా సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో తిరుపతికి చెందిన కెనరాబ్యాంకు ఉన్నతాధికారిణి ఒకరు జోక్యం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
కెనరా బ్యాంక్‌లో ఘటన