
మోటార్ సైకిళ్ల దొంగ అరెస్టు
చిన్నమండెం : పలు ప్రాంతాలలో పలు మోటారు సైకిళ్లను దొంగతనానికి పాల్పడ్డ దొంగను అరెస్టు చేసినట్లు రాయచోటి ఎస్‌డీపీఓ క్రిష్ణమోహన్, రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్ తెలిపారు. శుక్రవారం చిన్నమండెం పోలీస్‌స్టేషన్‌లో నిందితుడితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. చిన్నమండెం ఎస్‌ఐ సుధాకర్, సిబ్బందితో కలిసి మోటారు సైకిళ్ల చోరీలపై నిఘా ఉంచామన్నారు. చిన్నమండెం, కలకడ, రాయచోటిలలో చోరీకి అయిన కొన్ని మోటారుసైకిళ్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. నిందితుడు రాయచోటిలోని ఏజీ గార్డెన్‌కు చెందిన సద్దాం కాగా రాయచోటిలోని రాజులకాలనీలో ప్రస్తుతం నివాసం ఉంటున్నాడన్నారు. జూలై 31న చిన్నమండెం మండలం తూర్పుపల్లె క్రాస్ రోడ్డు వద్ద తమ సిబ్బంది వాహనాల తనిఖీలు చేస్తుండగా.. అతన్ని పట్టుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద ఐదు మోటారు సైకిళ్లను రికవరీ చేయగా, వాటి విలువ రూ.8.85 లక్షలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నమండెం ఎస్‌ఐ సుధాకర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.