
నేడు వైఎస్‌ఆర్ జిల్లాకు సీఎం చంద్రబాబు రాక
కడప సెవెన్‌రోడ్స్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం ఆగస్టు 1న జమ్మలమడుగు మండలంలో పర్యటిస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా గూడెం చెరువు గ్రామంలో లబ్ధిదారు గృహానికి వెళ్లి పింఛన్ల పంపిణీ, ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే నానుబాల యల్లప్ప ఫంక్షన్ హాలులో స్థానిక నేతలతో భేటీ , అనంతరం గండికోటలో పలు అభివృద్ధి ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు.
సీఎం షెడ్యూల్
ఉదయం 11.45 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిక్యాప్టరులో బయల్దేరి మధ్యాహ్నం 12.15 గంటలకు జమ్మలమడుగులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోనీ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 12.25కు గూడెంచెరువుకు చేరుకుంటారు. 12.45 వరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. 12.50 గంటలకు గూడెంచెరువులోని ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. 2 గంటల వరకు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. 2.35 నుంచి 3.35 వరకు నానుబాల యల్లప్ప ఫంక్షన్ హాల్‌లో స్థానిక కేడర్ నేతలతో సమావేశం అవుతారు. అనంతరం 3.45కు హెలిక్యాప్టరులో బయల్దేరి 3.55 గంటలకు గండికోట హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 4.05 గంటలకి గండికోటలో ఓబెరాయ్ హోటల్, జార్జ్ వ్యూ పాయింట్, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 4:35 గంటల నుండి 5:25 గంటల వరకు జెకె రిసార్ట్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన స్టేక్ హోల్డర్స్, ప్రాజెక్టు డెవలపర్లతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 5.50కి కడప విమానాశ్రయం చేరుకుంటారు. 6.00 గంటలకు కడప నుంచి బయలుదేరుతారు.
సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
జమ్మలమడుగు రూరల్: సీఎం నారా చంద్రబాబు నాయుడి జమ్మలమడుగు పర్యటనను కలసికట్టుగా విజయవంతం చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత అన్నారు. శుక్ర వారం జమ్మలమడుగు మండలపరిధిలోని గూడెంచెరువు గ్రామంలో జరిగే ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆమె ముఖ్యమంత్రి పర్యటన సలహాదారు పెందుర్తి వెంకటేశ్ జిల్లా నేతలతో కలిసి పర్యవేక్షించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారా యణరెడ్డి, జమ్మలమడుగు ఇంఛార్జీ భూపేష్‌రెడ్డి , ఆర్డీఓలు జాన్ ఎర్విన్, చంద్రమోహన్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.