
పెద్దచెప్పలి ఘటన దురదృష్టకరం
కమలాపురం: వైఎస్‌ఆర్ జిల్లా పెద్దచెప్పలి జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం ఓబుళరెడ్డి మద్యం తాగి పాఠశాలకు వచ్చిన ఘటన దురదృష్టకరం అని డీఈఓ షంషుద్ధీన్ అన్నారు. ఈ ఘటనపై స్పందించిన వైఎస్‌ఆర్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ హెచ్‌ఎంను సస్పెండ్ చేయడంతో పాటు డీఈఓను విచారణ అధికారిగా నియమించారు. ఈ మేరకు బుధవారం డీఈఓ పెద్దచెప్పలి జెడ్పీ హైస్కూల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. హెచ్‌ఎం ప్రవర్తన గురించి పాఠశాలలోని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తాగిన విషయం వాస్తవమేనని, కొన్ని రోజులుగా తాగి పాఠశాలకు వస్తున్నారని డీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం డీఈఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. సమాజంలో విద్యార్థులు ప్రజలు, తల్లిదండ్రులు, ఇరుగు పొరుగువారితో ఎలా మెలగాలో, ఎలా ప్రవర్తించాలో విద్యా బుద్ధులు నేర్పే వారే ఇలా మద్యం తాగి పాఠశాల రావడం తప్పు అన్నారు. చేసిన తప్పు హెచ్‌ఎం ఒప్పుకున్నారన్నారు. ఉపాధ్యాయులు సైతం పలుమార్లు హెచ్‌ఎంను ఇలా చేయడం సరికాదని చెప్పినప్పటికి ఆయన పద్ధతి మార్చుకోక పోవడం బాధాకరం అన్నారు. ఇప్పటికే ఆయనను కలెక్టర్ సస్పెండ్ చేశారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.