
వచ్చే నెల 2 నుంచి జమ్మలమడుగులో స్టాపింగ్
జమ్మలమడుగు: గుంటూరు–తిరుపతికి వెళ్లే రైలు ఆగస్టు 2 నుంచి జమ్మలమడుగులో స్టాపింగ్ ఉంటుందని రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల రైల్వే శాఖ ఉన్నతాధికారులు వచ్చినప్పుడు ఇక్కడి ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట, దాల్మియా పరిశ్రమల గురించి వివరించామని.., ఈ ప్రాంతం నుంచి గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చదువుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉందని జమ్మలమడుగులో ఈ రైలుకు స్టాపింగ్ ఇవ్వాలని కోరామన్నారు. దీంతో అధికారులు ఈనెల 2వతేది నుంచి రైలు నిలుపుతున్నట్లు ఉత్తర్వులను విడుదల చేశారన్నారు. అదేవిధంగా ధర్మవరం–మచిలిపట్నం రైలును కొండాపురం స్టాపింగ్ ఉంటుందని వివరించారు.
నేడు వైఎస్‌ఆర్ జిల్లాకు
మంత్రి సవిత రాక
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత గురువారం కడపకు రానున్నారు. జిల్లాలో గురు, శుక్రవారాల్లో రెండ్రోజులపాటు పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు పులివెందులలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు జమ్మలమడుగుకు చేరుకుంటారు. ఆగస్టు 1న జమ్మలమడుగులో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన నిమిత్తం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం జమ్మలమడుగులోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రికి కడపలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ చేరుకుని బస చేస్తారు. మరుసటి రోజు శనివారం జమ్మలమడుగులో జరగబోయే సీఎం చంద్రబాబునాయుడు కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొననున్నారు.